కేరళ వర్షాలు : భారీ విరాళం ప్రకటించిన హీరోలు

11 Aug, 2018 19:21 IST|Sakshi
సినీ హీరోలు సూర్య, కార్తి( ఫైల్‌ ఫోటో)

భారీ వర్షాలతో  ఉక్కిరిబిక్కిరైన  కేరళను ఆదుకునేందుకు  ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు.  సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని  కేరళ ముఖ్యమంత్రి ఇలా విజ్ఞప్తి చేశారో లేదో సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో హీరో కార్తి వేగంగా స్పందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల  అందించనున్నామని  తమిళ, తెలుగు సినీరంగంలో హీరోలుగా  వెలుగొందుతున్న ఈ సోదర బృందం  వెల్లడించింది.

మరోవైపు  కేరళను భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు  అక్కడి జనజీవనాన్ని స్థంభింపజేశాయి. కొన్నిచోట్ల  కొండ చరియలు విరిగిపడ్డాయి. నదులు, ఉపనదులు  ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో  కేరళవాసులను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చారు. కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలను ఆదుకుందాం. వయనాడ్‌ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు రేపు చెన్నైలోని మహాలింగపురంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకుంటాం. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ వాసులను ఆదుకుందాం. కష్టసమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందాం. అత్యవసర వస్తువులను ప్రజలు అందజేయాల్సిందిగా నటుడు విశాల్ కోరారు.

కాగా కేరళలో వరద పరిస్థితిని సమీక్షించిన  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా మృతులకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు వెల్లడించారు.  అంతేకాదు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిగా విరాళాలివ్వాల్సింగా శనివారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు