ఫ్రెండ్‌ పేరుతో డీప్‌ ఫేక్‌ కాల్‌.. తొలి కేసు నమోదు ఎక్కడంటే?

12 Nov, 2023 09:30 IST|Sakshi

తిరువనంతపురం: ఇటీవలి కాలంలో డీప్‌ ఫేక్‌ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు వీడియో కాల్స్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ సాయంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులుగా ఫోన్స్‌ చేస్తూ మోసం చేస్తున్నారు. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ సాయంతో ఫ్రెండ్స్‌ ఫేసులతో వీడియో కాల్స్‌ చేసి డబ్బులు కాజేస్తున్న కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా, కేరళలో తొలి డీప్‌ ఫేక్ కింద కేసు నమోదు అయ్యింది. 

వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి రాధాకృష్ణన్‌ డీప్‌ ఫేక్‌ మోసంలో చిక్కుకొని రూ.30 వేలు పోగొట్టుకున్నారు. ఇక, ఆయన ఫిర్యాదుతో కేరళలో తొలి డీప్‌ఫేక్‌ మోసం కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, రాధాకృష్ణన్‌ కోల్‌ఇండియా సంస్థలో పని చేసి రిటైరయ్యారు. కాగా, ఆయన పనిచేస్తున్న సమయంలో వేణుకుమార్‌ అనే మరో వ్యక్తిగా విధులు నిర్వర్వించారు. ఈ క్రమంలో కేటుగాళ్లు వేణుకుమార్‌ ఫొటో సాయంలో డీప్‌ ఫేక్‌ మోసానికి పాల్పడ్డారు. 

అయితే, వేణుకుమార్‌ పేరుతో ఇటీవల రాధాకృష్ణన్‌కు వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేసి.. తాను దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఇండియాలో తన సోదరి  ఆపరేషన్‌ కోసం రూ.40 వేలు అత్యవసరంగా కావాలని రిక్వెట్‌ చేశాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా వీడియోలో వేణుకుమార్‌ ముఖం కనిపించడంతో రాధాకృష్ణన్ వెంటనే‌ డబ్బులు పంపించారు. 

ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి తర్వాత రాధాకృష్ణన్‌కు వేణుకుమార్‌లాగా మళ్లీ ఫోన్‌ చేసి మరో రూ.30 వేలు కావాలని కోరారు. దీంతో, రాధాకృష్ణన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే తేరుకున్న రాధాకృష్ణన్‌.. తన స్నేహితుల సాయంతో వేణుకుమార్ ‌ఫోన్‌ నెంబరును తెలుసుకున్నాడు. అనంతరం, అతడికి కాల్‌ చేసి.. వివరాలు అడిగాడు. ఈ క్రమంలో వేణుకుమార్‌.. తాను ఏపీలో ఉన్నానని, ఫోన్‌ చేయలేదని చెప్పటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ ఘటనపై రాధాకృష్ణన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు గుజరాత్‌కు చెందిన షేక్‌ మర్తుజ్‌మియాగా గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు సీపీ రాజ్‌పాల్‌ మీనా తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు కుశాల్‌షా పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు