ఉన్నావ్‌ కేసు: కుల్దీప్‌ సింగ్‌కు జీవితఖైదు

20 Dec, 2019 14:22 IST|Sakshi

శిక్షను ఖరారు చేసిన తీస్‌హజారీ కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. తనను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఓ మైనర్‌ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను ఈ నెల 16న దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం (376) కింద ఆయనను దోషిగా కోర్టు నిర్థారించింది. బాలిక కిడ్నాప్‌.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్‌ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. (సెంగార్‌కు ఉరే సరి)

కాగా అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు.  రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. (‘ఉన్నావ్‌’ దోషి ఎమ్మెల్యేనే)

సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్‌ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్‌), 366  (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్‌పై పోలీసులు కేసులు పెట్టారు. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్‌ సింగ్‌ ఉన్నావ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు