జాతి మరువని నేత శాస్త్రి..

19 Feb, 2016 16:06 IST|Sakshi
జాతి మరువని నేత శాస్త్రి..

సాక్షి: లాల్ బహదూర్ శాస్త్రి.. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన సమరయోధుడు. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ నినదించి జవాన్లు, రైతుల గొప్పతనాన్ని తెలియజేసిన నేత. పాక్‌పై యుద్ధంలో భారత సైన్యాన్ని విజయ పథంలో నడిపించి, దేశ కీర్తిని ఇనుమడింపజేసిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు. దార్శనికుడుగా పేరెన్నికగన్న లాల్ బహదూర్ శాస్త్రి గురించిన జీవిత విశేషాలు తెలుసుకుందాం..

బాల్యం, వివాహం..
లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయి గ్రామంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. తల్లిదండ్రులు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామ్‌దులారీ దేవి. శాస్త్రికి ఇద్దరు చెల్లెళ్లు కైలాషీదేవి, సుందరీ దేవి. ఆయన ఏడాది వయస్సులోనే తండ్రి మరణించారు. అప్పటినుంచి తాతగారింటి వద్దే పెరిగారు. విద్యాభ్యాసం వారణాసి, మొఘల్ సరాయిల్లో జరిగింది. శాస్త్రి ఎప్పుడూ నిరాడంబరతతో ఉండేవారు. తోటి విద్యార్థులు గేలి చేస్తున్నా పట్టించుకునేవాడు కాదు. దీంతో ఉపాధ్యాయులకు శాస్త్రిపై మక్కువ ఉండేది. 1926లో కాశీ విద్యాపీఠం నుంచి ఆయన ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆ రోజుల్లో విద్యాపీఠం ఇచ్చే పట్టాను ‘శాస్త్రి’ అని అనే పదంతో గౌరవంగా సంబోధించేవారు. దీంతో శాస్త్రి అన్నది ఆయన పేరులో భాగమైపోయింది. శాస్త్రి భార్య లలితాదేవి. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.

రాజకీయ జీవితం..
1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత శాస్త్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది ఆయన రాజకీయ జీవితంలోని తొలి అడుగు. అనంతరం గోవింద్ వల్లభ్ పంత్ నేతృత్వంలో యూపీ రాష్ట్ర పోలీసు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రవాణాశాఖ మంత్రిగా ఉండగా తొలిసారిగా మహిళా కండక్టర్లను నియమించారు. 1951లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. 1952-59 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ైరె లు ప్రమాదంలో 112 మంది మరణించడంతో పదవికి రాజీనామా సమర్పించారు. అయితే దీన్ని నాటి ప్రధాని నెహ్రూ ఆమోదించలేదు. మరో మూడు నెలల్లోనే తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదంలో 144 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. తిరిగి 1957లో కమ్యూనికేషన్, రవాణా శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం సంపాదించారు.

ఉద్యమ స్ఫూర్తి..
మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రభావితుడైన శాస్త్రి, వారి స్ఫూర్తితో 1921 నుంచి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అలహాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్లు జైలు జీవితం అనుభవించారు. 1940-46 మధ్య పూర్తిగా జైల్లోనే ఉన్నారు.

ప్రధానిగా ఎన్నిక..
నాటి ప్రధానిగా ఉన్న నెహ్రూ 1964 మే 7వ తేదీన కన్నుమూశారు. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి ఆ పదవి చేపట్టాల్సి వచ్చింది. అలా శాస్త్రి దేశ రెండో ప్రధానిగా 1964 జూన్ 9న ఎంపికయ్యారు. ఆయన పదవీ కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.  దీర్ఘకాలిక ఆహార కొరతను నివారించేందుకు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో పాల ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా శ్వేత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.

తాష్కెంట్ ఒప్పందంలో కీలకపాత్ర..
శాస్త్రి ప్రధానిగా ఉండగా భారత్-పాక్ మధ్య 1965లో 22 రోజులపాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో ఆయనకు ఎనలేని కీర్తి దక్కింది. యుద్ధానంతరం దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థల్ని మెరుగుపర్చడంలో శాస్త్రి కీలక పాత్ర పోషించారు. చైనా వల్ల ఏర్పడిన సమస్యల్ని శాంతియుతంగా, సమర్ధవంతంగా పరిష్కరించారు. పాక్ రాష్ట్రపతి మహ్మద్ ఆయుబ్‌ఖాన్‌తో కలిసి 1966 జనవరి 10న తాష్కెంట్ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తాష్కెంట్ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. ఆ మరుసటిరోజే శాస్త్రి గుండెపోటుతో మరణించారు.

విదేశీ సంబంధాలు మరింత మెరుగ్గా..
విదేశీ సంబంధాల విషయంలో నెహ్రు సిద్ధాంతాన్నే శాస్త్రి కూడా కొనసాగించారు. సోవియట్ యూనియన్‌తో సంబంధాలు ఈయన హయాంలో మరింత మెరుగయ్యాయి. శ్రీలంకలో తమిళుల కోసం నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్మీకి కేటాయించే రక్షణ బడ్జెట్‌ను పెంచారు. దేశంలో శాంతిస్థాపన దిశగా కృషి చేశారు.

శాస్త్రి మృతిపై వీడని మిస్టరీ..
ఆయన మరణం అనేక సందేహాలకు తావిచ్చింది. ఇప్పటికీ శాస్త్రి మృతిపై పలు అనుమానాలున్నాయి. ఆయన ఆకస్మిక మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. శాస్త్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అప్పటివరకు గుండెపోటు రాలేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్‌ఎన్.చాగ్ తెలిపారు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారని, శరీరానికి పోస్టమార్టమ్ నిర్వహించలేదని పలువురు ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించిన వివరాలు అనూజ్ ధర్ అనే జర్నలిస్ట్ అడిగినప్పటికీ సరైన సమాధానం రాలేదు. శాస్త్రి రెండో కుమారుడు అనిల్ శాస్త్రి ప్రస్తుతం అమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు. తన తండ్రి మరణం సహజసిద్ధమైనది కాదని, దీనిపై విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నాలుగో కుమారుడు అశోక్‌శాస్త్రి బీజేపీ నేత. అనిల్ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా శాస్త్రి మరణంపై ప్రభుత్వాలు సరైన విచారణ చేపట్టలేదనే వాదన ఇంకా వినిపిస్తూనే ఉంది.

మరిన్ని వార్తలు