ఈ సారి లాల్‌బ‌గ్చా గ‌ణేశుడి ఉత్స‌వాలు లేవు

1 Jul, 2020 14:11 IST|Sakshi

ముంబై: దేశంలో క‌రోనా ధాటికి అత‌లాకుత‌ల‌మ‌వుతున్న న‌గ‌రాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో వినాయ‌క ఉత్స‌వాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ముంబైలోని ప్ర‌ముఖ లాల్‌బగ్చా రాజ సార్వ‌జ‌నిక్ గ‌ణేషోత్స‌వ మండ‌లి నిర్ణ‌యించింది. వైర‌స్‌ విజృంభణ వ‌ల్ల‌ వినాయ‌క చ‌తుర్థి వేడుక‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఇందుకు బ‌దులుగా కోవిడ్‌తో చ‌నిపోయినవారి కుటుంబ స‌భ్యుల‌కు అండ‌గా నిలిచేందుకు ఆర్థిక స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు ఉత్స‌వ మండ‌లి సెక్ర‌ట‌రీ సుధీర్ సాల్వీ మీడియాకు తెలిపారు. దీంతోపాటు వైర‌స్ బారిన ప‌డిన రోగుల కోసం ర‌క్త‌దానం, ప్లాస్మా దానం క్యాంపుల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. (‘వినాయక’ విడుదల ఎప్పుడు?)

కాగా 1934 నుంచి లాల్‌బ‌గ్చా మండ‌లి  క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌ణేశుడిని ప్ర‌తిష్టిస్తూ వేడుక‌లు నిర్వ‌హిస్తోంది. కానీ ఈ యేడాది ఉప‌ద్ర‌వంలా వ‌చ్చిప‌డ్డ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ విగ్ర‌హ ప్ర‌తిష్టతో స‌హా ఎలాంటి వేడుక‌లు నిర్వ‌హించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే చూడా ఈసారి గ‌ణేశుడి ప్ర‌తిమ‌లు నాలుగు అడుగుల క‌న్నా ఎక్కువ ఎత్తులో ఉండ‌వ‌ద్ద‌ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది వినాయ‌క చ‌తుర్థి వేడుక‌లు సాదాసీదాగా జ‌రుపుకోవాల‌ని, పందిళ్ల‌లో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. (ముంబైకి మరో ముప్పు)

మరిన్ని వార్తలు