పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి

20 Oct, 2016 16:06 IST|Sakshi
పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వారిలో ఐదుగురు మహిళలున్నారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి శివకాశిలో తయారయ్యే టపాసులు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేసే తమిళనాడులోని శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఇదే తరహా ప్రమాదం జరిగింది. శివకాశి శివార్లలో భారీస్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ చేసే ఓ గోడన్‌లో మంటలు చెలరేగాయి. అందులో దాదాపు 30 మంది వరకు పనివాళ్లు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, 20 వరకు ద్విచక్ర వాహనాలు కూడా తగలబడిపోయాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది.. దానికి కూడా మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పెద్దస్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు