వసుంధరపై పోటీకి సై!

17 Nov, 2018 17:21 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కొడుకు, శివ్‌ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. రాజ్‌పుత్‌ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్‌పై గెలుపొందిన మన్వేందర్‌ సింగ్‌ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్‌ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది.

ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు..
బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మన్వేందర్‌ సింగ్‌‍కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని,  రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు.

కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్‌ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్‌ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్‌ను రాజ్‌పుత్‌కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.


 

మరిన్ని వార్తలు