‘ప్రపంచకప్‌లో ఆడాలనేది ధోని కోరిక’

17 Nov, 2018 16:55 IST|Sakshi

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో.. సుదీర్ఘకాలంపాటు టీమిండియాను శాసించిన  మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనికి ప్రస్తుతం జట్టులో చోటు కరువైంది. ఇప్పటికే ఈ రాంచీ ప్లేయర్‌ టెస్టుల నుంచి రిటైర్మెంట్‌ కాగా.. టీ20 నుంచి సెలక్టర్లు తప్పించారు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ల నుంచి ధోనిని తప్పించిన విషయం తెలిసిందే. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ వరకైనా ధోని జట్టులో ఉంటాడా అనేది కూడా అనుమానమే.. ఈ తరుణంలో ధోని స్నేహితుడు, రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ మేనేజర్‌ అరుణ్‌ పాండే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

టీమిండియా భవిష్యత్‌ కోసమే..
వన్డే, టీ20ల సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడానికి బలమైన కారణాలున్నాయని పాండే అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్‌ ప్రారంభమయ్యేవరకు కొత్త సారథికి జట్టుపై పూర్తి పట్టుండాలనే ఉద్దేశం, అదే విధంగా అతడు ప్రణాళికలు రూపొందించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలనే కారణంతోనే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నాడని తెలిపారు. అయితే కెప్టెన్సీ వదులుకున్నా మెంటర్‌గా విరాట్‌ కోహ్లికి సలహాలు ఇవ్వాలని భావించాడని, అంతే కాకుండా వచ్చే ప్రపంచకప్‌లో ఆడాలని కలల కనేవాడని వివరించారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచప్‌లో పాల్గొనే టీమిండియాకి ధోని అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. 

కనీసం అర్థసెంచరీ సాధించక ఏడాది పైనే..
అభిమానులు ధోని ధనాధనా బ్యాటింగ్‌ చూడకే చాలా నెలలే అవుతున్నాయి. చివరి అర్థసెంచరీ శ్రీలంకపై చేసి ఏడాది పైనే అయింది. మళ్లీ ఇప్పటివరకు ధోని నుంచి మరపురాని ఇన్నింగ్స్‌ను చూడలేదు. మరోవైపు యువ ఆటగాడు, కీపర్‌ రిషబ్‌ పంత్‌ చెలరేగి ఆడుతుండటంతో ధోనిని తప్పించి అతడికి టీ20ల్లో అవకాశం కల్పించారు. ఇక వన్డేల నుంచి కూడా జార్ఖండ్‌ డైనమైట్‌ను సాగనంపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
 

మరిన్ని వార్తలు