బట్టతలపై జుట్టు వస్తుందని చెబితే..

7 Jun, 2016 20:36 IST|Sakshi
బట్టతలపై జుట్టు వస్తుందని చెబితే..

సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన తలకట్టు ఉండాలని ఎవరూ అనుకోరు.. పిన్నవయస్సు నుంచి వృద్ధ వయస్సు దాకా అందరూ ఒతైన జుట్టు కావాలని ఆరాటపడుతుంటారు. దువ్వెన తలనే పదేపదే దువ్వుతూ మురిసిపోతుంటారు. వృద్ధ వయస్సులో రావాల్సిన బట్టతల ముందుగానే వస్తే.. అంతే..! తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. తలపై జుట్టు పెరిగే ఉపాయాల జాబితా తిరిగేస్తారు.. ఎవరైనా పలనా తింటే.. జుట్టు పెరుగుతుందనీ, ఔషధం రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబితే ఆ వ్యక్తి ఊహాలకు రెక్కలు తొడుగుతాయి. బట్టతల నుంచి విముక్తి పొందలన్నా అత్యాశతో ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అచ్చంగా అలాగే చేసాడో వైద్యవిద్యార్థి. తన అందమైన క్రాఫ్‌పై మోజుపడిన విద్యార్థి ఏకంగా తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.

ఈ దయనీయమైన ఘటన చెన్నైలో మంగళవారం వెలుగుచూసింది. మద్రాసు మెడికల్ కాలేజీ విద్యార్థి సంతోష్‌కుమార్ బట్టతలతో తెగ ఇబ్బంది పడేవాడు. ‘బట్టతల మీ వివాహానికి అడ్డంకిగా మారిందా. దిగులుపడొద్దు. మా వద్దకు రండి. అందమైన క్రాఫ్‌ను అమరుస్తాం’ అనే ప్రకటనకు ఆకర్షితుడైన అతడు నుంగంబాక్కంలోని ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. అక్కడి అనస్తీషియా డాక్టర్ చైనాలోని ఒక వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థి సాయంతో సంతోష్‌కుమార్‌కు మత్తుమందు ఇచ్చి చికిత్స ప్రారంభించారు.

ఉదయం ప్రారంభించిన చికిత్స సాయంత్రం వరకు కొనసాగగా సృహలోకి వచ్చిన సంతోష్‌కుమార్ తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వేలూరు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అనుభవం లేకుండా బట్టతలకు జుట్టు అమర్చేందుకు చేసిన ప్రయత్నం వికటించిన కారణంగానే సంతోష్‌కుమార్ ప్రాణాలు కోల్పోయాడని అనుమానిస్తూ కుటుంబసభ్యులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు