ఆయన ప్రైమ్‌ టైమ్‌ మినిస్టర్‌

23 Feb, 2019 01:54 IST|Sakshi

ప్రధాని మోదీని ఎద్దేవా చేసిన రాహుల్‌ గాంధీ

పుల్వామా ఘటనను ప్రధాని పట్టించుకోలేదన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసినా ప్రధాని మోదీ ఫొటోషూట్‌ సాగించారంటూ కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఉగ్రదాడి విషయం తెలిసిన తర్వాత కూడా షూటింగ్‌ కొనసాగించిన మోదీ ప్రైమ్‌ మినిస్టర్‌ (ప్రధానమంత్రి) కాదు.. ప్రైమ్‌టైమ్‌ మినిస్టర్‌ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులు కాగా దేశ ప్రజలు, సైనికుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగి ఉన్న సమయంలో  ప్రధాని మోదీ మాత్రం దాదాపు మూడు గంటలపాటు చిరునవ్వుతో నదిలో విహరిస్తూ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు’అంటూ రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పుల్వామా ఘోర దుర్ఘటనపై ప్రధాని స్పందించలేదు, అస్సలు పట్టించుకోలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆ పార్టీ ప్రతినిధి మనీష్‌ తివారీ  మాట్లాడుతూ..దాడి జరిగిన రోజు సాయంత్రం 3.10 గంటల నుంచి 5.10 గంటల మధ్య ఏం చేశారో ఆయన వెల్లడించాలని  డిమాండ్‌ చేశారు. ఆయన ఆ ఘటనపై స్పందించలేదు లేదా ఘటన విషయం రెండు గంటలపాటు తెలియకపోయి అయినా ఉండాలి అని విమర్శించారు. 

తప్పుడు ప్రచారం ఆపండి: బీజేపీ
పుల్వామా దాడి విషయం తెలిసి కూడా ప్రధాని మోదీ ‘ఫొటోషూట్‌’లో పాల్గొన్నారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని బీజేపీ మండిపడింది.

మరిన్ని వార్తలు