ఏటీఎంలు పెడితే డబ్బొస్తుంది!

13 Dec, 2015 02:56 IST|Sakshi
ఏటీఎంలు పెడితే డబ్బొస్తుంది!

ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు డబ్బుకు కటకటగా ఉంది. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ భారమవుతోందట. సాధారణంగా టాయిలెట్ల బయటివైపు బిల్‌బోర్డులు పెట్టి ప్రకటనల కోసం వాటికి అద్దెకివ్వడం సాధారణమే. అలాకాకుండా ఈ టాయిలెట్ల ద్వారా ఇంకా అదనపు ఆదాయం సంపాదించాలని ఆలోచించిన కార్పొరేషన్ అధికారులకు ఓ ఐడియా వచ్చింది. కొత్తగా కట్టబోయే 150 పబ్లిక్ టాయిలెట్లలో ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి వీలుగా గదులు పెడతారట. వీటిని ఆసక్తి చూపిన బ్యాంకులకు అద్దెకిచ్చి ఆదాయం పొందుతామని మేయర్ రవీంద్ర యాదవ్ చెప్పారు.

టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉంటే సరి... లేకపోతే మాత్రం కంపుకొట్టే ఏటీఎంలలో డబ్బులు తీసుకునేందుకు జనం ముందుకొస్తారా? కార్పొరేషన్ మరో ఆలోచన కూడా చేస్తోంది. మున్సిపల్ స్కూళ్ల ప్రాంగణాల్లోని కొంతభాగాన్ని ఏటీఎం కేంద్రాలు, కోచింగ్ సెంటర్లకు అద్దెకివ్వాలని ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

మరిన్ని వార్తలు