17నిమిషాల ఆడియోతో కానిచ్చేశారు

12 Mar, 2017 12:44 IST|Sakshi
17నిమిషాల ఆడియోతో కానిచ్చేశారు

మోరెనా(మధ్యప్రదేశ్‌): పెళ్లిళ్ల అనవసర ఖర్చులను నియంత్రించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానున్న నేపథ్యంలో తక్కువ ఖర్చులు, హంగులు ఆర్భాటాలకు పోకుండా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఓ జంట పెద్దగా ఆడంబరాలకు పోకుండా కేవలం 17 నిమిషాల వ్యవధితో ఉన్న మంత్రాల ఆడియో సహాయంతో పెళ్లితంతును కానిచ్చేశారు. 200మంది ఆహ్వానితుల మధ్య మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమం జరిపించేందుకు పంతులును కూడా పిలిపించలేదు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని మోరెనా ప్రాంతంలో జారా అనే గ్రామానికి చెందిన వధువుకు బ్రిజేశ్‌ దాస్‌ అనే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. అయితే, తొలుత భారీగా వీరి వివాహం జరిపించాలని భావించుకున్నప్పటికీ అనవసరపు వ్యయం అవసరమా అని భావించిన వారు రాంపాల్‌ మహారాజ్‌ అనే సెయింట్‌ మాట విని సాధారణ వివాహానికి అంగీకరించారు. ఇరు వర్గాల అంగీకారంతో కనీసం డీజే, అలంకరణ కూడా లేకుండా మాములుగా వివాహం చేసుకున్నారు. 17నిమిషాల మంత్రాల ఆడియో అయిపోగానే వివాహం అయిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇతర వివాహాల్లో మాదిరిగానే బంధువులకు విందుభోజనాలు వడ్డించి పంపించారు.

>
మరిన్ని వార్తలు