కర్మభూమిలో కురువృద్ధుడికి అవమానం!

12 Jun, 2016 18:22 IST|Sakshi
కర్మభూమిలో కురువృద్ధుడికి అవమానం!

పార్లమెంట్ లో రెండు సీట్లతో ప్రారంభమై, మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో భారతీయ జనతా పార్టీని నిలిపిన మూడు స్తంభాల్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. మిగతా ఇద్దరు అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీలు. చివరి ఇద్దరి కంటే భిన్నంగా మనోహర్ జోషి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ ఉన్నతికి కృషి చేశారు. జోషి పుట్టింది నైనిటాల్ లోనే అయినప్పటికీ అలహాబాద్ యూనివర్సిటీలో ఆయన జీవితం మలుపు తిరిగింది. విద్యార్థిగా ప్రవేశించి, పీహెచ్ డీ పూర్తిచేసి, వర్సిటీలోనే ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన అలహాబాద్ పేరు చెబితే చాలా మందికి.. నెహ్రూ, ఇందిర, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియాలతోపాటు మురళీ మనోహర్ జోషి పేరు కూడా గుర్తుకొస్తుంది. అలాంటి కర్మభూమిలో, సొంత పార్టీ నేతల చేతిలోనే అవమానానికి గురయ్యారు మనోహర్ జోషి.

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యూహరచన చేసేందుకు బీజేపీ ఆదివారం అలహాబాద్ లో జాతీయ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర సీనియర్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతటి కీలక సమావేశానికి కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని పిలవకపోవడంపై అలహాబాద్ లోని ఆయన అనుచరగణం భగ్గుమంటోంది. సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం తెలుపుతూ యూపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ జోషి ఫొటో ఎక్కడా కనిపించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. అద్వానీ, వాజపేయిల ఫొటోలు కూడా ఏక్కడోగానీ కనబడలేదట.

'జోషి గారు రెండు రోజులుగా అలహాబాద్ లోనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు రమ్మని ఏఒక్కరూ ఆయనను పిలవలేదు. ఇది జోషిని అవమానించినట్లు కాదా? ఇలాంటి చర్యల ద్వారా ఇప్పుడున్న నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు?' అంటూ మీడియా ముందు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జోషి అనుచరులు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై పార్టీ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. అలహాబాద్ నుంచి మూడు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన మనోహర్ జోషి.. 2009లో వారణాసి నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. సంఘ్ నిర్దేశకత్వంలో మోదీ-షా ద్వయం నడిపిస్తోన్న బీజేపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఎప్పుడో తగ్గిపోయిందని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' పిలుపునిచ్చిన పార్టీ 'కాంగ్రెస్ యుక్త్'లా మారిపోయిందని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు కామెంట్ చేశారు.

>
మరిన్ని వార్తలు