అమ్మనే ఉత్తమ గురువు

5 Sep, 2015 02:01 IST|Sakshi
అమ్మనే ఉత్తమ గురువు

నేను ఈ స్థాయికి చేరడానికి కారణం అమ్మే: ప్రణబ్

  •  పిల్లలకు పాఠాలు చెప్పిన ప్రథమ పౌరుడు

 న్యూఢిల్లీ: తాను ఈ స్థాయికి చేరుకున్నాననంటే అదంతా తమ అమ్మ చలవేనని, తనకు అమ్మే ఉత్తమ గురువు అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ప్రపంచంలో అందరికీ తల్లే ఉత్తమ టీచర్ అని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన ‘బి ఎ టీచర్’ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఎస్టేట్‌లో ఉన్న 'డా.రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ' పాఠశాలలో ప్రణబ్ టీచర్ అవతారం ఎత్తారు. అక్కడి విద్యార్థులకు చరిత్ర పాఠాలు చెప్పారు. తన చిన్ననాటి అనుభూతులను పంచుకున్నారు. 'చిన్నప్పుడు  తుంటరి పనులు చేస్తూ మా అమ్మ చేతిలో దెబ్బలు  తిన్నాను. కానీ కొద్దిసేపటికే అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని లాలించేది. ప్రతిఒక్కరికీ అమ్మే ఉత్తమ గురువు. మీకు కూడా మీ అమ్మే ఉత్తమ గురువు..' అని చెప్పారు.

తన చిన్నతనంలో తండ్రి కమదా కింకార్ జీవితం ఎప్పుడూ పార్టీ కార్యాలయం, జైలు మధ్యే గడిచేదని.. తన తల్లే తనను పెంచిందని చెప్పారు. 'మా ఊళ్లోని తోటి పిల్లలతో కలసి ఆవుల మందల వెంట వెళ్లేవాడిని.  ఆడుకునేవాడిని. కానీ నాకు చీకటి అంటే భయం. అందుకే సూర్యాస్తమయం అవుతోందనగానే ఇంటికి తిరిగి వెళ్లేవాడిని. రోజూ ఐదు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవాడిని. అంత దూరం ఎందుకు వెళ్లాలంటూ అమ్మను అడిగితే.. తనకు మరో మార్గం లేదని చెప్పేది. ఏదైనా కష్టించి పనిచేయాలని చెబుతూ ఉండేది' అని తెలిపారు. కార్యక్రమంలో ప్రణబ్ 11వ, 12వ తరగతి పిల్లలకు 'భారతదేశ రాజకీయ చరిత్ర' పై గంటపాటు పాఠాలు చెప్పారు. దేశ చరిత్రలో రాష్ట్రపతి పదవిలో ఉండగా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇదే తొలిసారి. తాను ఇప్పుడు రాష్ట్రపతిని కాదని, మీకు టీచర్‌నని చెబుతూ.. తనను 'ముఖర్జీ సార్' గా పిలవాలని కోరారు. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీడియా, ఎన్జీవోలు తోడ్పడుతున్నాయని ప్రశంసించారు. మాజీ ప్రధానులు  నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల హయాంలో దేశ ఆర్థిక అభివృద్ధికి చేసిన కృషిని కూడా ఆయన పాఠంలో ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు