విభజన రాజకీయాలే కాంగ్రెస్ నైజం

23 Dec, 2013 00:25 IST|Sakshi
విభజన రాజకీయాలే కాంగ్రెస్ నైజం


 ముంబై ‘మహాగర్జన’లో మోడీ ధ్వజం
 బ్రిటిష్‌వారి దగ్గర నేర్చుకుందంటూ ఎద్దేవా

 సాక్షి, ముంబై: సమాజాన్ని ముక్కలు చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. ఓట్ల కోసం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడుతూ వారి నుంచి విభజించి పాలించడాన్ని కాంగ్రెస్ నేర్చుకుందని విమర్శించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. భరతమాతను విభజించి ముక్కలు చేశారు. ఒకవైపు స్వతంత్ర భారత్‌ను సర్దార్ పటేల్ ఒక్కటి చేశారు. నలుదిశలా ఐక్యత మంత్రం ప్రతిధ్వనించింది. ఇంకోవైపు భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట దేశంలో అన్నదమ్ముల మధ్య తగువుపెట్టడానికి కాంగ్రెస్ విత్తనం నాటింది’ అని మండిపడ్డారు. ముంబైలో ఆదివారం జరిగిన ‘మహాగర్జన’ బహిరంగసభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై నిప్పులు చెరిగారు. అవినీతికూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. అవినీతిని రూపుమాపడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతోందని, అది ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ‘నిన్న నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పేద్ద నాయకుడి ప్రసంగం విన్నాను. ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒకవైపు అవినీతిలో నిండా మునిగిపోయి, మరోవైపు అమాయకంగా ముఖం పెట్టి అవినీ తిని రూపుమాపాలంటూ నీతులు చెప్తారు. ఆ ధైర్యం చూడండి. వేరెవ్వరికి అంత ధైర్యం ఉండదు’ అని రాహుల్‌గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటోందెవరో చిన్న పిల్లాడిని అడిగినా చెపుతాడని మోడీ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. ‘మాకెవరికి విదేశాల్లోని బ్యాంకుల్లో డబ్బుల్లేవని అద్వానీజీ నేతృత్వంలో బీజేపీ ఎంపీలు లేఖ కూడా రాశారు. ధైర్యముంటే విదేశాల్లో దాచిన నల్లధనం వ్యవహారంలో చట్టం చేయండి. కమిటీ వేయండి. ఆ డబ్బును వెనక్కు తీసుకురండి. పేదలకు పంచండి‘ అని మోడీ కాంగ్రెస్‌కు సవా లు విసిరారు. ఫిక్కీ సదస్సులో శనివారం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. అవినీతి దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని, దాన్ని రూపుమాపితేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పల్లెలు, పట్టణాల మధ్య తగవులు పెట్టిందని, నదీజలాల కోసం వివాదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. నదీజలాల కోసం 50 ఏళ్ల నుంచి కొట్టుకోని రాష్ట్రమంటూ దేశంలో లేదన్నారు.
 
 బాంద్రాలోని ఎంఎంఆర్‌డీఏ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో మొదట మరాఠీలో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి విముక్తి లభిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అలా జరగాలంటే ముందు కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభించాలని వ్యాఖ్యానించారు. ‘చరిత్ర వల్లనో, భౌగోళిక పరిస్థితుల కారణంగానే దేశం సమస్యలు ఎదుర్కోవడం లేదు. భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం కాంగ్రెస్ పాలన’ అని విమర్శించారు. అందువల్ల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ‘క్విట్ ఇండియా’ నినాదం వచ్చిన ముంబై నుంచే ‘కాంగ్రెస్ లేని భారత్’ నినాదం రావాలని మోడీ పిలుపునిచ్చారు. ‘యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను విధుల్లోంచి తప్పించి, ఇనుపతుక్కుగా మార్చాలని ఈ ప్రభుత్వం అనుకుంటోంది. మనమేమో రైతుల నుంచి ఇనుప ముక్కలను సేకరించి సర్దార్ వల్లభాయ్‌పటేల్ ఐక్యతా ప్రతిమను నిర్మించాలనుకుంటున్నాం. చూడండి.. మనం సంస్కృతిని పరిరక్షించాలనుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని నాశనం చేస్తోంది’ అని యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. మైనారిటీవాదం, మతతత్వం కాంగ్రెస్ పార్టీ విధానాలని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో నదీజలాల కోసం 50 ఏళ్ల నుంచి కొట్టుకోని రాష్ట్రం అంటూ లేదని వ్యాఖ్యానించారు. గుజరాత్, మహారాష్ట్రలు ఒకేసారి 1960 మే 1న ఏర్పడ్డాయని, అప్పటినుంచి గుజరాత్‌లో 14 మంది ముఖ్యమంత్రులు పనిచేయగా, మహారాష్ట్రలో 26 మంది ముఖ్యమంత్రులు మారారని, అభివృద్ధిలోనూ గుజరాత్ ముందంజలో ఉందని తెలిపారు. అభివృద్ధిలో ఎందుకు వెనకబడ్డామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదర్శ హౌజింగ్ కుంభకోణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. మహాగర్జన సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ప్రజలకు విరక్తి వచ్చిందని, ఇక ఏ శక్తి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత.. దేశానికి మోడీ రూపంలో మరో టెండూల్కర్ లభించాడని గోపీనాథ్ ముండే వ్యాఖ్యానించారు. సభలో ఎన్నికల ఫండ్‌గా రూ. 25కోట్ల చెక్‌ను ముంబై బీజేపీ శాఖ మోడీకి అందించింది. కాగా, పలుదేశాలు దౌత్యాధికారులు హాజరైన ఈ సభకు అమెరికా దౌత్య కార్యాలయం నుంచి ఎవరూ హాజరుకాలేదు. మహాగర్జన సభకు సుమారు 5 లక్షల మంది హాజరైనట్లు అంచనా. పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, సీనియర్ నేత గోపీనాథ్ ముండే, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు.
 
 ఓట్ ఫర్ ఇండియా..
 మోడీ ఈ సారి కొత్త నినాదంతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ కోసం కాకుండా దేశం కోసం ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి, వంశపారంపర్య పాలన, ద్రవ్యోల్బణం, కుపరిపాలనల నుంచి దేశానికి స్వేచ్ఛ కావాలంటే ‘ఓట్ ఫర్ ఇండియా’ అని చెప్పాలనుకుంటున్నానన్నారు.
 
 టీ అమ్మేవారికి ప్రత్యేక పాసులు
 ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైలోని దాదాపు 10 వేల మంది చాయ్‌వాలాలకు ప్రత్యేక పాసులిచ్చారు. ఈ విషయాన్ని తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ మోడీ.. ‘చూడండి.. మార్పు మొదలైంది. రానున్న రోజుల్లో సామాన్యుడే వీఐపీ అవుతాడు’ అన్నారు. గతంలో మోడీ రైల్వే స్టేషన్‌లో టీలు అమ్మేవారన్న విషయం తెలిసిందే.
 
 జనవరిలో గోవాలో మోడీ సభ
 గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చిన్న కుమారుడు అభిజిత్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మోడీ డిసెంబర్ 26న కానీ, 27న కానీ గోవా వెళ్లనున్నారు. అలాగే, గోవాలో మోడీ హాజరయ్యే ర్యాలీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నుంచి జనవరి రెండో వారానికి వాయిదా వేశారు.
 
 చరిత్రలో మోడీ ఇంకా వీకే: ఎన్సీపీ
 చరిత్రకు సంబంధించిన అంశాల్లో నరేంద్రమోడీకి పరిజ్ఞానం తక్కువన్న విషయం మరోసారి రుజువైందని నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ  వ్యాఖ్యానించింది. 1960 నుంచి మహారాష్ట్రలో 17 మంది ముఖ్యమంత్రులు మాత్రమే పనిచేశారని, మోడీ చెప్పినట్లు 26మంది కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్‌మాలిక్ తెలిపారు.

మరిన్ని వార్తలు