నేపాల్ ప్ర‌ధానికి మ‌తి భ్ర‌మించింది : అభిషేక్ సింగ్వి

14 Jul, 2020 14:29 IST|Sakshi

ఢిల్లీ :  రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య నేపాల్‌లోనే ఉంద‌ని, శ్రీరాముడు నేపాల్ దేశ‌స్తుడంటూ ప్ర‌క‌టించిన నేపాల్ ప్ర‌ధానిపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మ‌తి భ్ర‌మించి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్ర‌ధాని ఆదేశాల మేర‌కే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణ‌లు చేస్తున్నారంటూ దుయ్యబ‌ట్టారు. గ‌తంలోనూ భార‌త భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు త‌మ‌వేనంటూ నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్ప‌డు రాముడు నేపాలీ దేశ‌స్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది! )

సోమ‌వారం ఓ మీడియాతో ఓలీ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్‌ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఎలాంటి క‌మ్యూనికేష‌న్ లేని కాలంలో సీత‌ను వివాహం చేసుకోవ‌డానికి రాముడు జ‌న‌క్‌పూర్‌కు ఎలా వ‌చ్చాడంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత భార‌త‌దేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జ‌న‌క్‌పూర్‌కు రావ‌డం అసాధ్య‌మంటూ పేర్కొన్నాడు. అయితే నేపాల్‌ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్‌ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. 

మరిన్ని వార్తలు