ఎదురుదెబ్బ తగిలినా.. వెనక్కి తగ్గని సీఎం

2 Oct, 2016 19:51 IST|Sakshi
ఎదురుదెబ్బ తగిలినా.. వెనక్కి తగ్గని సీఎం

పాట్నా: మద్య నిషేధంపై బిహార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినా.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేదం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాట్నా హైకోర్టు శుక్రవారం కొట్టివేసినా.. నితీశ్ మాత్రం ఈ విషయంపై పట్టుదలగానే ఉన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున సీఎం కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ఎక్సైజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ 2016 పేరుతో తీసుకొచ్చిన ఆ చట్టాన్ని ఆదివారం ప్రభుత్వం నోటిఫై చేసింది.

ఈ చట్టం ప్రకారం దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), దేశీయ మద్యం అమ్మకం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. పాత చట్టంలోని నిబంధనలకు తోడు జరిమానా, జైలుశిక్ష విషయంలో కఠినమైన నిబంధనలను ఈ కొత్త చట్టంలో చేర్చారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం ‘అసంబద్ధం, నిరంకుశం’ అని కోర్టు శుక్రవారం తీర్పులో పేర్కొంది. ఈ చట్టం అమలుకోసం సర్కారు తీసుకొచ్చిన చర్యలు నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, జస్టిస్ నవనీతి ప్రసాద్ సింగ్‌ల ధర్మాసనం బిహార్ ఎక్సైజ్ సవరణ (2016) చట్టంలోని 19 (4) సెక్షన్ ‘రాజ్యాంగ విరుద్ధం, అమలుకు నోచుకోవటం కష్టం’ అని వెల్లడించింది. అయితే కొన్ని సవరణలు తీసుకొస్తూ బిహార్ ప్రభుత్వం చట్టం అమలులోకి తీసుకొచ్చింది.

>
మరిన్ని వార్తలు