ప్రముఖుల దూరం.. ఇండియా కూటమి భేటీ వాయిదా

5 Dec, 2023 13:52 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో రేపు జరగనున్న ఇండియా కూటమి భేటీని వాయిదా వేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా ప్రముఖులు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెంటనే డిసెంబర్ 6న  ఇండియా కూటమి భేటీకి కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఇండియా కూటమి భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు తమ బదులుగా పార్టీ నుంచి ఇతర సభ్యులను పంపుతామని ఇప్పటికే ప్రకటించారు. "ఇండియా కూటమి సమావేశానికి అఖలేష్ యాదవ్ హాజరయ్యే ఆలోచన లేదు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ లేదా అఖిలేష్ సూచించిన ఇతర నేత ఎవరైనా సమావేశానికి వెళతారు" అని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.

అటు.. జేడీయూ నుంచి పార్టీ చీఫ్ లాలన్ సింగ్, బిహార్ నీటి వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఘా సమావేశానికి హాజరుకానున్నారు. ఇండియా కూటమి భేటీకి తాను కూడా హాజరు కాలేనని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే తెలిపారు. ఉత్తర బెంగాల్‌లో పర్యటించాల్సిన ఇతర షెడ్యూల్‌ను సూచిస్తూ భేటీకి దూరంగా ఉన్నారు. మిచౌంగ్ తుపానుతో చెన్నై ఎయిర్‌పోర్టు బంద్ అయిన కారణంగా తాను రాలేనని సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండటం కీలక సంకేతాలను అందిస్తున్నాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.   

ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్

>
మరిన్ని వార్తలు