అమానుషం: ఫొటోలు తీశారు గానీ... 

2 Nov, 2019 16:04 IST|Sakshi

పుదుచ్చేరి : ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి.. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న బాధితులకు... సహాయం కోసం అర్థిస్తున్న అభాగ్యులకు వీలైతే సహాయం చేయాల్సింది పోయి.. వారిని ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ బంధించి ఆనందించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని అతడి బంధువులు తోపుడు బండిలో తీసుకెళ్తుంటే బాటసారులు చోద్యం చూశారే తప్ప అంబులెన్సుకో లేదా మరేదైనా వాహనానికో ఫోన్‌ చేయలేదు. పరోక్షంగా అతడి మరణానికి కారణమయ్యారు.

వివరాలు... తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం పూర్తిగా క్షీణించింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు. అయితే రోజూవారీ కూలీలైన సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడా లేకపోవడంతో వారు అంబులెన్సుకు ఫోన్‌ చేయలేకపోయారు. దీంతో తమ ఇంట్లో ఉన్న తోపుడు బండిలో తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు మీద వాళ్లను చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. 

కాగా తోపుడు బండిపై ఆస్పత్రికి చేరుకునే సమయానికే సుబ్రమణి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే అక్కడ మరోసారి వాళ్లకు చేదు అనుభవమే ఎదురైంది. పుదుచ్చేరి సరిహద్దు నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు పుదుచ్చేరి వాహనాలకు అనుమతి లేకపోవడంతో.. శవంతో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసు అధికారి మురుగనందన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన అంబులెన్సును రప్పించి సుబ్రమణి శవాన్ని సొంతూరికి తరలించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ ఇరులా తెగకు చెందిన సుబ్రమణి టీబీతో బాధపడుతున్నాడు. వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లిన క్రమంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. అయితే వాహన సదుపాయం లేకపోవడంతో సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లక పోవడంతో అతడు మరణించాడు. మార్గమధ్యలో ఎంతో మంది వారిని చూశారే గానీ ఒక్కరూ సహాయం చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటనే స్పందించి ఉంటే అతడి ప్రాణాలు నిలిచేవి’ అని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు