‘ఐరన్‌ లేడీ’ పెళ్లికి తొలగిన అడ్డంకి

12 Aug, 2017 23:03 IST|Sakshi
‘ఐరన్‌ లేడీ’ పెళ్లికి తొలగిన అడ్డంకి

కొడైకెనాల్‌: మణిపూర్‌ ఉక్కు మహిళ, పౌరహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల(44) వివాహానికి అవరోధం తొలగింది. బ్రిటిష్‌ జాతీయుడైన డెస్మండ్‌ కౌటిన్హోను ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మహేంద్రన్‌ అనే లాయర్‌, హక్కుల కార్యకర్త అభ్యంతరం తెలిపారు. ఆ దంపతులు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తమిళనాడులోని కొడైకెనాల్‌ సబ్‌రిజిస్ట్రార్‌కు తెలియజేశారు. దీనిపై విచారణ జరిపిన ఆయన ఆ అనుమానాలను కొట్టిపారేశారు.

షర్మిల, డెస్మండ్‌ కౌటిన్హోల వివాహానికి, ఇక్కడ నివాసం ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. కౌటిన్హోతో తన వివాహానికి అనుమతి ఇవ్వాల్సిందిగా జూలై 12వ తేదీన ఇరోం షర్మిల సబ్‌రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఎలాంటి అభ్యంతరాలున్నా నెల రోజుల్లోగా ఎవరైనా తెలియజేయాల్సి ఉంది. సబ్‌ రిజిస్ట్రార్‌​ తాజా నిర్ణయంతో ఆమె వివాహానికి అడ్డంకులు తొలగిపోయాయి.

మరోవైపు సైనిక ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లపాటు పోరాటం చేసిన ఉక్కు మహిళ షర్మిల గతేడాది ఆగస్టు 9న ఆమరణ నిరాహారదీక్షను విరమించారు. ఈ ఏడాది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయగా కేవలం 90 ఓట్లే సొంతం చేసుకుని ఓటమిపాలయ్యారు. ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న షర్మిల.. మళ్లీ మణిపూర్‌ వెళ్లాలనుకోవడం లేదని ఇటీవల స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు