జీఎస్‌టీతో రాష్ట్రాలకు నష్టంలేదు

20 Dec, 2014 03:21 IST|Sakshi
జీఎస్‌టీతో రాష్ట్రాలకు నష్టంలేదు

వస్తు, సేవల పన్ను బిల్లుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
బిల్లుపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడి
ఈ సమావేశాల్లో తీసుకురాబోమని చెప్పిన కాసేపటికే లోక్‌సభలో బిల్లు

 
 న్యూఢిల్లీ: పన్ను విధింపు వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రాష్ట్రాలకు చెందిన వివిధ పన్నుల స్థానంలో దేశవ్యాప్తంగా సరుకులకు, సేవలకు ఒకే పన్ను విధించేందుకు  వీలుకలిగించే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని రూపకల్పనలో రాష్ట్రాల ప్రయోజనాల రక్షణకు తగిన చర్యలు తీసుకున్నామని, ఇది రాష్ట్రాలకూ లాభకరమేనని, జైట్లీ ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్రాలతో విస్తృతంగా జరిగిన చర్చల్లో బిల్లుపై ఏకాభిప్రాయం దాదాపుగా కుదిరిందన్నారు. జీఎస్‌టీ వ్యవస్థకోసం రాజ్యాంగానికి 122వ సవరణ చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోమని, పార్లమెంటు తదుపరి సమావేశాల్లోనే తీసుకువస్తామని, చివరి నిమిషంవరకూ బిల్లుపై సూచనలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాజ్యసభలో ప్రకటన చేసిన కొద్దిసేపటికే జైట్లీ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం.
 
 గత బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జీఎస్‌టీ బిల్లును జైట్లీ సభలో ప్రవేశపెడుతూ,..ఈ బిల్లుతో ఏ రాష్ట్రమూ రూపాయి కూడా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. కొత్త పన్ను వ్యవస్థ అందించే ప్రయోజనాల విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు సమాన అవకాశాలుంటాయన్నారు. 2010-2013 మధ్య కాలానికి కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్‌టీ)కు సంబంధించి రాష్ట్రాలకు తగిన పరిహారం చెల్లిస్తామని, వచ్చే మార్చి నెలాఖరులోగా మొదటి విడత చెల్లింపు జరుగుతుందని అన్నారు. జీఎస్‌టీ బిల్లు తమకు నష్టదాయకమన్న ఆందోళన రాష్ట్రాలకు అవసరంలేదని, అసలు నష్టం జరిగే అస్కారమే లేదని జైట్లీ అన్నారు. జీఎస్‌టీ పన్ను వ్యవస్థతో దేశీయ మార్కెట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది దోహదపడుతుందని జైట్లీ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి అమల్లోకి వస్తున్న అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ జీఎస్‌టీ మాత్రమేనన్నారు.
 
 జైట్లీ పేర్కొన్న మరిన్ని వివరాలు
 -    జీఎస్‌టీ పేరుతో దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చే ఒకే రేటు పన్నుతో సరుకులు, సేవలపై కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోదం పన్ను, ఆక్ట్రాయ్, ప్రవేశ పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను తొలగిపోతాయి. సరుకుల బదిలీ సులభతరమవుతుంది. పన్నుపై మళ్లీ పన్ను విధించే పద్ధతి తప్పుతుంది.
 -    మద్యాన్ని జీఎస్‌టీ పరిధినుంచి దూరంగా ఉంచినా, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు ఈ వ్యవస్థలో భాగంగా ఉండబోతున్నాయి, వాటిని జీఎస్‌టీలోకి పొందుపరిచబోయే తేదీని జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుంది. జీఎస్‌టీ మండలిలో మూటింట రెండు వంతుల మంది సభ్యులు రాష్ట్రాల ప్రాతినిధ్యం గలవారే ఉంటారు. అన్ని జీఎస్‌టీ మండలి నిర్ణయాలకు 75 శాతం వోట్ల మద్దతు అవసరం.
 -    జీఎస్‌టీ అమలయ్యే తొలి రెండేళ్లలో రాష్ట్రాలు తమకు నష్టమొస్తుందని భావించినపుడు, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్‌టీకి అదనంగా ఒకశాతం పన్ను విధించుకునే అవకాశం ఉంటుంది.
 -    జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలకు ఎలాంటి నష్టానికి అవకాశంఉన్నా, తొలి మూడేళ్లలో వందశాతం నష్టపరిహారానికి వీలుంటుంది. నాలుగో సంవత్సరం 75 శాతం, ఐదో సంవత్సరంలో 50 శాతం నష్ట పరిహారం చెల్లింపు ఉంటుంది.
 -    జీఎస్‌టీతో రాష్ట్రాలకు నష్టం జరగదు. రాష్ట్రాలను పటిష్టపరచడమే మా లక్ష్యం. అప్పుడే జాతీయ ఆర్థిక వ్యవస్థా బలోపేతమవుతుంది. బిల్లుపై దాదాపుగా గతవారమే ఏకాభిప్రాయం కుదిరింది. రాష్ట్రాల ఆందోళలను పరిగణనలోకి తీసుకుని బిల్లులో అనేక రక్షణ ఏర్పాట్లు పొందుపరిచాం.
 

మరిన్ని వార్తలు