ఉత్తరాదిని పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

19 Jan, 2018 19:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో నానాటికి పెరుగుతున్న జనాభానే పెద్ద సమస్యనే విషయం పాఠశాలకు వెళ్లే ప్రతి పిల్లవాడితో సహా ప్రతి పౌరుడికి తెల్సిందే. అందుకనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1952లో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చిన దేశంగా భారత్‌కు గుర్తింపు వచ్చింది. మరో ఆరేళ్లలో మరో గుర్తింపు రానుంది. ప్రస్తుతం 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం 2024 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమిస్తుందన్నదే ఆ రికార్డు. 1950లో చైనా జనాభా మనకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేదంటే ఇప్పుడు ఎంత వేగంగా జనాభాలో ముందుకు దూసుకుపోతున్నామో గ్రహించవచ్చు.

జనాభా పెరుగుదలకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు విడదీయలేని అనుబంధం ఉంటుందనే విషయం తెల్సిందే. అంటే జనాభా ఎక్కువ ఉంటే సామాజిక ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, తక్కువ ఉంటే తక్కువ ఉంటాయని అర్థం. ఎక్కడైనా ఇది నిజమేగానీ మన రాష్ట్రాల విషయంలో మాత్రం ఇది పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి ఎక్కువ. మరణాలు తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి తక్కువ మరణాలు ఎక్కువ. అంటే ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా పెరుగుతోంది. దక్షిణాదిలో పెరుగుదల చాలా తక్కువగా ఉంటోంది. మన దేశంలో రాష్ట్రాల నుంచి పన్ను వసూళ్లు ఆర్థిక ప్రగతిపై ఆధారపడి ఎక్కువ, తక్కువగా ఉంటే, ఆర్థిక వనరుల పంపకాలు మాత్రం జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడి ఉత్తరాది రాష్ట్రాలు బతుకుతున్నాయి.

కేంద్రం చెప్పిన లెక్కలే ఇవి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనాభా గణాంకాల ప్రకారం బిహార్‌లో సంతానోత్పత్తి రేటు 3.41 శాతం ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో 2.74 శాతం ఉంది. అంటే భారత్‌లోని మొత్తం జనాభాలో మూడోవంతు జనాభా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. 1951 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో జనాభా బిహార్‌కన్నా ఎక్కువగా ఉండగా, నేడు తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్ల జనాభా బిహార్‌లో ఎక్కువగా ఉంది. అదే 1951లో కేరళకన్నా మధ్యప్రదేశ్‌ జనాభా 37శాతం ఎక్కువగా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌ జనాభా కేరళకన్నా 217 శాతం ఎక్కువ. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 శాతానికి మించలేదు. దేశం మొత్తం మీద 1.17 శాతంతో సిక్కింలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది.

దక్షిణాది రాష్ట్రాలకే రూపాయికిపైగా కేటాయింపులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి చెల్లిస్తే కేంద్రం నుంచి 52 పైసలు వెనక్కి వచ్చేది. అలాగే తమిళనాడుకు 56 పైసలు, కేరళకు 49 పైసలు వచ్చేది. ఇక బిహార్‌ రూపాయి చెల్లిస్తే 1.17 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు కూడా రూపాయికిపైగానే ముట్టేది. అంటే దక్షిణాది రాష్ట్రాలిచ్చే నిధులతో ఉత్తరాది రాష్ట్రాలు కడుపునింపుకుంటున్నాయి. తాజా లెక్కలు అందుబాటులో లేవు. ఇదే కారణంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా జీఎస్టీ బిల్లు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు.

ఎంపీ సీట్ల విషయంలోనూ అన్యాయం
ఇక జనాభా ప్రాతిపదికనే పార్లమెంట్‌ సీట్ల సంఖ్య ఆధారపడి ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాలే ఎక్కువగా లాభపడుతున్నాయి. అమెరికాలో రాష్ట్రం ప్రాతిపదిక సీట్ల కేటాయింపు ఉండగా, భారత్‌లో 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన 1976లో పార్లమెంట్‌ సీట్ల కేటాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆ తర్వాత అమలు పీరియడ్‌ను 2026 వరకు పొడిగించారు. ఈ కారణంగానే 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, నాలుగు రాష్ట్రాల నుంచే 51 శాతం సీట్లను గెలుచుకుంది. అధిక జనాభా కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఉద్యోగార్థుల వలసలు పెరుగుతున్నాయి. అదీ కూడా మనకు నష్టమే. మొత్తంగా అధిక జనాభా కలిగిన ఉత్తరాది హిందీ రాష్ట్రాలు లాభపడుతుంటే, జనాభా తగ్గి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు