సీజేఐపై అభిశంసన; సంచలన పరిణామాలు

20 Apr, 2018 14:05 IST|Sakshi

అభిశంసన వార్తలను నిషేధించే యోచనలో కోర్టు?

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విపక్షాలు ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చాయి. ఏడు పార్టీలకు చెందిన సుమారు 71 మంది ఎంపీలు అభిసంశన నోటీసులపై సంతకాలు చేశారు. సదరు తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు.

జస్టిస్‌ లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్లైంది. పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ దుర్దినంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. సీజేఐ దీపక్‌ మిశ్రాపై నలుగురు సీనియర్‌ జడ్జిలు తిరుగుబావుటా ఎగరేసిన సందర్భంలోనే అభిశంసన అంశం తెరపైకి వచ్చినా, విపక్షాల్లో ఏకాభిప్రాయం కొరవడటంతో అది ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు ఒక్కతాటిపైకి రావడంతో తీర్మానానికి బలంపెరిగినట్లైంది.

అభిశంసన వార్తలపై నిషేధం!: చీఫ్‌ జస్టిస్‌పై అభిశంసన తీర్మానం పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిశంసన గురించి సమాజంలో చర్చ జరుగడం దురదృష్టకరమని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయం సన్నగిల్లే ప్రమాదం ఉందని, కాబట్టి అభిశంసనకు సంబంధించిన అన్ని వార్తలను నిషేధించడమే ఉత్తమమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రభుత్వ న్యాయాధికారుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని భావిస్తున్నది.

అది జరిగేపని కాదు: కాగా, చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అభిశంసన జరిగేపని కాదని మాజీ అటార్నీ జనరల్‌ సొలి సొరబ్జీ అన్నారు. ‘చెప్పిన తీర్పుల ఆధారంగా ఒక న్యాయమూర్తిపై అభిశంసన పెట్టడం కుదరదు. ఆ జడ్జి అనుచితంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభిశంసన తీర్మానం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత దానిపై రాష్ట్రపతి తుది నిర్ణయం తీసుకుంటారు’ అని సొరబ్జీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు