క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌.. ఐపీఎల్‌కు దెబ్బ..!

20 Apr, 2018 14:31 IST|Sakshi

లండన్: క్రికెట్‌లో ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ20 అనే మూడు ఫార్మాట్లు మనకు సుపరిచితం. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు 10 ఓవర్ల మ్యాచులు కూడా నిర్వహిస్తారు. అయితే ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) చేసిన ప్రతిపాదన క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎనిమిది నగరాల మధ్య పోటీ ఏర్పాటు చేసి, 100 బంతులతో కూడిన కొత్త రకం ఫార్మాట్‌ను తమ దేశీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు అభిమానులకు ఒకింత ఆశ్చర్యంతో పాటు, గందరగోళానికి గురి చేసింది.

ఈ ఫార్మాట్‌లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు.. 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌తో మొత్తం 100 బంతులు ఉండేట్లుగా ప్లాన్‌ చేస్తున్నామని బోర్డు తెలిపింది. ఈ ప్లాన్‌ గనుక కార్యరూపం దాల్చితే 2020 ఏడాది నుంచి నూతన ఫార్మాట్‌ను చూడొచ్చని పేర్కొంది. ఈసీబీ ప్రకటనపై ఇప్పుడు ట్విటర్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాన్‌ స్పందిస్తూ.. ‘క్రికెట్‌లో ఇప్పుడు 5, 4, 3, 2 రోజుల క్రికెట్‌, 50, 40, 20, 10 ఓవర్లు, హాంగ్‌ సిక్సెస్‌ల క్రికెట్‌ ఉంది. ఇప్పుడు 100 బంతుల క్రికెట్‌.. గుడ్‌లక్‌.. ఈ గొప్పనైన ఆటను అర్థం చేసు​కుంటున్నా’  అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ‘ఈసీబీ కొత్త ఫార్మాట్‌ ఐపీఎల్‌ను పాతిపెడుతుంది’ అంటూ గార్డియన్‌ రైటర్‌ బెర్నే భిన్నంగా స్పందించాడు.

‘క్రికెట్‌లో ఇప్పటికే మూడు ఫార్మాట్లు ఉన్నాయి. నాలుగోది అవసరం లేదనుకుంటా. టీ20 మంచి ఫార్మాట్‌. దానిని మరింత కుదించడం సరైంది కాదంటూ’  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘క్రికెట్‌ మొత్తాన్ని డెసిమలైజ్‌ చేయొచ్చుగా.. 10 బంతులు, 10 ఓవర్లు, 10 మంది ఆటగాళ్లు, 10 నిమిషాలు అంటూ’  మరో నెటిజన్‌ చురకలు అంటించడం గమనార్హం.

మరిన్ని వార్తలు