పాక్‌ ప్లాన్‌ : భారత్‌పైకి తాలిబన్‌ మూక

9 May, 2018 15:07 IST|Sakshi

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌ ఇంటిలిజెన్స్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటిలిజెన్స్‌(ఐఎస్‌ఐ) భారీ కుట్ర పన్నుతోంది. జైళ్లలో ఉన్న తెహ్రిక్‌ ఐ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) ఉగ్రవాదులను విడుదల చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కశ్మీర్‌ లోయలో దాడులకు పంపేందుకు సిద్ధమవుతోందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

‘పవిత్ర యుద్ధం’ కోసం వెళ్లడానికి సిద్ధపడే ఒక్కరిని విడుదల చేస్తామని ఐఎస్‌ఐ జైళ్లలోని తాలిబన్లకు ఆఫర్‌ చేసినట్లు వివరించాయి. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నయాలీ అటవీ ప్రాంతంలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఐఎస్‌ఐ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. దాదాపు 135 మంది ఉగ్రవాదులకు జైషే ఈ మహమ్మద్‌ ఉగ్రసంస్థ నయాలీలోని శిక్షణ కేంద్రంలో ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని వివరించాయి. ప్రస్తుతం హిజ్బుల్‌ మొజాహిదీన్‌ కంటే జైషే ఈ మొహమ్మద్‌, లష్కర్‌ ఏ తైబాలనే పాకిస్తాన్‌ ఎక్కువ నమ్ముతున్నట్లు తెలిసింది.

కశ్మీర్‌ లోయ గుండా సాగే అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ ఏడాది జూన్‌లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభంకానుంది. దీనిపై హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించింది. అమర్‌నాథ్‌ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ డీజీ రాజీవ్‌ భట్నాగర్‌ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు