ISRO Achievements In 2023: ఖాతాలోకి సరికొత్త రికార్డులు.. 2023కు గ్రాండ్‌ గుడ్‌ బై

24 Dec, 2023 13:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2023కి గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది. పాత జ్ఞాపకాలను తనలో దాచుకుని.. కొత్త ఏడాది వైపు వేగంగా పరుగులు తీస్తోంది టైమ్ మెషీన్‌. 2023లో భూమిపైనే కాదు అంతరిక్షంలోనూ సరికొత్త శిఖరాలను అందుకుంది భారత్‌. ఘనమైన విజయాలతో.. ఇస్రో గగన ప్రయాణంలో అత్యంత ప్రత్యేకంగా నిలిచిందీ సంవత్సరం.

2023 సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఒక మైలురాయి. అందని చందమామను అందుకోవడమే కాదు అనేక కీలక అచీవ్‌మెంట్స్‌ను ఖాతాలో వేసుకుంది ఇస్రో. ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఒకప్పుడు చిన్నచూపు చూసిన నాసా లాంటి సంస్థలు..కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపేలా అంతరిక్ష పరిశోధనల్లో సత్తా చాటింది.  

భారత ప్రభుత్వం..1969లో ఇస్రోను ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో అనేక అపజయాలు, అపహాస్యాలు చూసిందీ సంస్థ. నిధుల్లేక ప్రయోగాలు నిలిచిపోయిన ఉదంతాలెన్నో. అలాంటి పరిస్థితి నుంచి వరుస విజయాలు, కీలక మైలురాళ్లతో స్పేస్ సెక్టార్‌లో ఉవ్వెత్తున ఎగసింది ఇస్రో. ఈ గగన విజయంలో 2023 ఏడాది అత్యంత కీలకం. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా అత్యంత క్లిష్టమైన, కీలక ప్రయోగాల్లో తనదైన స్టైల్‌లో సత్తా చాటింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటివరకు ఎవరికి సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 

అంచలంచెలుగా ఒక్కో లోపాన్ని అధిగమించి విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోకు.. 2023 బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పాలి. ప్రయోగాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడంతోపాటు గొప్ప గొప్ప రికార్డులు ఇస్రో అకౌంట్‌లో పడ్డాయి. చంద్రయాన్ - 2 పాక్షిక విజయంతో 2019లో అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. 2023లో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతరిక్ష దిగ్గజాలుగా పేరొందిన దేశాలకు సైతం అందని ద్రాక్షగా మిగిలిపోయిన చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసి.. ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అమెరికా, రష్యా, జపాన్‌ లాంటి దేశాలు చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టినా.. సౌత్‌ పోల్‌పై ల్యాండింగ్ చేయలేక పోయాయి. అలాంటి చోట ల్యాండింగ్ కావడం, అక్కడి విశేషాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఇస్రో.

ఇక చంద్రయాన్ - 3 విజయయోత్సాహంలో ఉన్న ఇస్రో.. నెలల వ్యవధిలోనే మరో చరిత్రాత్మక ప్రయోగం చేపట్టింది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్ 1ను నింగిలోకి పంపింది. ప్రస్తుతం నిర్దేశిత గమ్యం దిశగా ఆదిత్య ప్రయాణం కొనసాగుతోంది. 2023లో మొత్తం 8 ప్రయోగాలను చేపట్టింది ఇస్రో. అన్నీ ఘనవిజయాలే. అందుకే ఆరు దశాబ్దాల ఇస్రో ప్రయాణంలో 2023 ఏడాది చాలా ప్రత్యేకంగా మారింది.

PSLV, GSLV, LVM3 లాంటి సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న లాంచ్ వెహికల్స్‌ భారత్‌ వద్ద ఉన్నాయి. ఇక చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపేందుకు సరికొత్త వాహక నౌక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV రూపొందించింది ఇస్రో. 2022లోనే దీన్ని ప్రయోగించినా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. 2023 ఫిబ్రవరిలో లోపాలను సవరించి విజయవంతం చేసింది ఇస్రో.

ఇస్రో పరిశోధనలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీగా నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచే వస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా దీనిపై దృష్టిపెట్టింది. ఇన్‌స్పేస్ ద్వారా స్పేస్ సెక్టార్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు తలుపులు తెరిచిన మోదీ సర్కార్‌.. ఆ దిశగా కీలక పురోగతి సాధిస్తోంది. ఇతర దేశాల శాటిలైట్లను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది ఇస్రో. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇప్పటివరకు 4వేలకోట్లకుపైగా సంపాదించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే స్పేస్‌టెక్‌ స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేస్తోంది ఇస్రో. ఇప్పటికే మనవద్ద 200కి పైగా స్టార్టప్ కంపెనీలు స్పేస్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

2023 విజయాల స్ఫూర్తితో భవిష్యత్‌ లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకుంది ఇస్రో. 2025 ప్రారంభంలో గగన్‌యాన్ మిషన్ చేపట్టనుంది. మానవరూప మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని సంబంధించి.. గగన్‌యాన్‌ ఫ్లైట్ టెస్ట్‌, క్రూ మాడ్యూల్ టెస్టులను ఇటీవలే విజయవంతంగా పూర్తిచేసింది. అలాగే వచ్చే నాలుగేళ్లలో చంద్రయాన్‌ -4 చేపట్టి.. చంద్రుడిపై నుంచి శిలలు భూమిపైకి తెచ్చే శాంపిల్ రిటర్న్ మిషన్‌కు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌.

2035 నాటికి అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోవడంతోపాటు 2040లో చంద్రుడిపైకి మనిషిని పంపాలని ఇస్రోకు బిగ్ టార్గెట్స్‌ ఇచ్చారు ప్రధాని మోదీ. మరోవైపు 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇస్రో. హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికి తీసేందుకు ఉద్దేశించిన ఈ మిషన్‌.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని పేర్కొంటున్నాయి ఇస్రో వర్గాలు. మొత్తానికి 2023 సంవత్సరం భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఇది మరింత ముందుకు సాగాలని.. ఇస్రో సమున్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు దేశ ప్రజలు. 

ఇదీచదవండి..చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ

>
మరిన్ని వార్తలు