పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం

15 Dec, 2017 11:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే గత సమావేశాల అనంతరం చనిపోయిన సభ్యుల మృతికి లోక్‌ సభ సంతాపం తెలిపింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు మౌనం పాటింంచారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... మంత్రివర్గంలో చేరిన సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు.

మరోవైపు రాజ్యసభలో...శరద్‌ పవార్‌ అనర్హత వ్యవహారంపై దుమారం రేగింది. దీనిపై చర్చించాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టారు. సభ్యులు వెల్‌లోకి దూసుకు వెళ్లడంతో  సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సమావేశాల్లో 14 కొత్త బిల్లులతోపాటు 25 పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఈసారి నెల ఆలస్యంగా సమావేశాలు మొదలయ్యాయి. అంతేకాదు, గత ఏడాది శీతాకాల సమావేశాలు 21 రోజులపాటు జరగ్గా ఈ సారి 14 రోజులే నడిచే అవకాశం ఉంది. ఆర్థిక మందగమనం, జీఎస్టీ పరిణామాలు, వ్యవసాయ రంగ సంక్షోభం వంటి అంశాలపై అధికార పక్షంపై దాడికి దిగేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టుకున్నాయి. కాగా సోమవారం (18వ తేదీ) గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

>
మరిన్ని వార్తలు