18 నుంచి డిసెంబర్‌ 13 వరకు

22 Oct, 2019 03:44 IST|Sakshi

పార్లమెంటు శీతాకాల సమావేశాలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్‌ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి.

నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్‌లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది.

>
మరిన్ని వార్తలు