సవరణ తప్పట! రద్దు మాత్రం రైటట!!

14 Dec, 2023 00:27 IST|Sakshi

సందర్భం

కేంద్ర ప్రభుత్వం జమ్మూ –కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 అధికర ణాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ అధ్యక్ష తన న్యాయమూర్తులు ఎస్కే కౌల్, సంజీవ్‌ ఖన్నా, బీఆర్‌ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ బెంచి కీలకమైన తీర్పును వెలువరించింది. దేశ సమగ్రతను పరిరక్షించాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ ‘సమర్థవంతంగా’ వాదించడంతో ఒకే ఒక్క అంశం మినహా అన్ని అంశాలలో అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాదన లతో పూర్తిగా ఏకీభవించింది. రాజ్యాంగ నిపుణులూ, ‘రూల్స్‌ ఆఫ్‌ లా’ తెలిసిన వాళ్లూ  తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది. ఈ 370 అధికరణ రద్దుపై తీర్పు దాదాపు అన్ని వాదాలనూ అంగీకరించింది. అయితే ఆర్టికల్‌ 370 రద్దు కోసం ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొ నడం గమనార్హం.  

సుప్రీంకోర్టు చర్చించిన ఎనిమిది ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. అయితే అందులో 6వ అంశాన్ని నిశితంగా పరీక్షించాల్సి ఉంది. ఈ అంశాన్నే కోర్టు తప్పు పట్టింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం కోసం ఆర్టికల్‌ 367ను సవరించడం మొత్తం చట్టపరమైన ప్రక్రియకు కీలకమైనది. అయితే ఈ సవరణ చట్టబద్ధం కాదని న్యాయమూర్తుల ధర్మపీఠం పేర్కొంది. ఆర్టికల్‌ 367 అనేది ఇంటర్‌ప్రెటేషన్‌ (వ్యాఖ్యానించే లేదా వివరించే) క్లాజ్‌ మాత్రమే. అంతేకానీ అది డెఫినిషన్‌ల (నిర్వచనాల)ను సబ్‌స్టిట్యూట్‌ (ప్రత్యామ్నాయంగా చూపే) చేసే క్లాజ్‌ కాదు.  అందుకే 1954లో జమ్మూ– కశ్మీర్‌కు అనువర్తించేలా తెచ్చిన కాన్‌స్టిట్యూషనల్‌ ఆర్డర్‌ (సీఓ) 272 ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు కోసం ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టవిరుద్ధం అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.  కోర్టు తీర్పు లోని అంశాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమ వుతుంది.

ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన విస్తృతమైన తీర్పులో సీఓ 272 ఉద్దేశ్యం ఆర్టికల్‌ 367లో మార్పులు చేయడానికి అన్నట్టుగా మొదట కనిపించినా, అది సమర్థంగా ఆర్టికల్‌ 370ని పూర్తిగా మార్చివేసిందని పేర్కొన్నారు.  ఈ మార్పులు గణనీ యంగా బలమైనవీ, స్థిరమైనవనీ కోర్టు పేర్కొంది. సవరణ ప్రక్రియలో రాజ్యాంగ నియమ భంగం చేస్తూ ఒక అధికరణాన్ని రద్దు చేయడానికి ఇంటర్ర్‌ పెటేషన్‌ క్లా్లజ్‌ (వ్యాఖ్యాన నిబంధన)ను సవరించే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒక రాజ్యాంగ సవరణకు నిర్దేశిత మార్గాన్ని తప్పించుకునేందుకు ఇంటర్‌ప్రెటేషన్‌  క్లాజ్‌ను ఉపయోగించే అధికారం లేదు కనుక ఆర్టికల్‌ 367ని ఆశ్రయించి ఆర్టికల్‌ 370కి చేసిన సవరణలు చట్టబద్ధం కాదని నిర్ధారించామనీ, ఇటువంటి అక్రమమైన పద్ధతుల ద్వారా సవరణ లను అనుమతించడం దురదృష్టకరం అనీ సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆర్టికల్‌ 370 (1) (డి) కింద అధికారాన్ని ఉపయోగించి ఆర్టికల్‌ 370ని సవరించే అధికారం కేంద్రానికి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సీజేఐ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, ఆర్టికల్‌ 367ను ఉపయోగించి 370ని సవరించే విషయంలో ఒక పద్ధతిని నిర్దేశించారనీ, దానిని అనుసరించకుండా దొడ్డి దారిలో అక్రమ  మార్గం నుంచి సవరణ అనుమతించడం సరికాదనీ జస్టిస్‌ ఎస్కే కౌల్‌ తన తీర్పులో వ్యాఖ్యానించారు.  

జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. మొదటగా  ‘సీఓ272’గా ప్రాచుర్యం పొందిన రాజ్యాంగపు (జమ్మూ–కశ్మీర్‌ అనువర్తిత) ఉత్తర్వు– 1954ను రద్దు చేసి, భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ–కశ్మీర్‌కు వర్తి స్తాయని ప్రకటించింది.  రెండవ దశలో అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 367ను కూడా సవరించి, 370 ఆర్టికల్‌ రద్దుకు మార్గం వేసుకొంది. 

పైన పేర్కొన్న రెండు దశల కన్నా ముందు, జారీ అయిన రాజ్యాంగపు (జమ్మూ–కశ్మీర్‌ అనువర్తిత) ఉత్తర్వు– 2019... సీఓ272 రద్దుకు కీలకమైన ఆధారం అని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జమ్మూ–కశ్మీర్‌ రాజ్యాంగ సభ సూచనల మేరకు మాత్రమే ఆర్టికల్‌ 370ని సవరించాలి. కానీ ఆ రాజ్యాంగ సభ మనుగడలో లేదు కాబట్టి  ఆర్టికల్‌ 367లో సీఓ272 ఉత్తర్వు ద్వారా ఒక క్లాజును ప్రవేశపెట్టారు.

ఈ క్లాజ్‌ ప్రకారం ఆర్టికల్‌ 370 క్లాజ్‌(2) అనుసరించి రాష్ట్ర రాజ్యాంగ సభను ‘రాష్ట్ర శాసన అసెంబ్లీ’గా చదువుకోవాలి. అయితే 2018 లోనే జమ్మూ–కశ్మీర్‌ శాసనసభను రద్దు చేసినందున, రాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉండటం వల్ల పార్లమెంటు ఆదేశం ‘రాజ్యాంగ శాసన సభకు సమానం’ అన్నట్టు పరిగణించారు. అంతే కాకుండా జీఓ272లో ఉన్న ‘జమ్మూ–కశ్మీర్‌ ప్రభుత్వం’ అంటే ‘జమ్మూ–కశ్మీర్‌ గవర్నర్‌’గా అర్థం చేసుకోవాలి వంటి క్లాజులను ఆర్టికల్‌ 367లో సృష్టించారు. 

వీటన్నింటినీ ఆధారంగా చూపి ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధమైన తీర్మానాన్ని లోక్‌ సభలో ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో లోక్‌సభ ఆమోదించింది. తర్వాత రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అయితే పార్లమెంటు ఆమోదించిన చట్ట పరమైన తీర్మానంపై, 2019 ఆగస్టు 6 నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆర్టికల్‌ 370కి సంబంధించిన అన్ని క్లాజులూ ‘2019 ఆగస్టు 6’ నుంచి నిర్వీర్యం అవుతాయని నోటిఫికేషన్‌ (సీఓ273)ని జారీ చేశారు. ఈ విధంగా జమ్మూ– కశ్మీర్‌ ప్రత్యేక హోదాను సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆర్టికల్‌ 370(3) కింద ఈ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు రాష్ట్రపతి  అధికారాలను ఉపయో గించుకున్నారు. 

ఈ అధికరణం రాష్ట్రపతి నిర్దేశించిన  తేదీ నుంచి ఉనికిలో ఉంటుందని కానీ, లేక పని చేయడం మానేస్తుందని కానీ, లేదా మినహాయింపు, సవరింపులతో పని చేస్తుందని ప్రకటించేందుకు రాష్ట్రపతికి ఆర్టికల్‌ 370 (3) అధికారమిస్తుంది. కనుక రాష్ట్రాన్ని జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్‌ లుగా విభజించేందుకు ‘జమ్మూ–కశ్మీర్‌ పునర్వ్య వస్థీకరణ బిల్లు–2019’ను పార్లమెంటు ఆమోదించడం అత్యంత రాజ్యాంగ వ్యతిరేక చర్య. ప్రత్యేకంగా, విడిగా చూసినప్పుడు... అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పు మొత్తంలో 367 అధికరణకు సవరణ చేయడం తప్పని కోర్టు చెప్పడం కేవలం ఒక అంశంగా మాత్రమే  ఉందనిపిస్తోంది. కానీ, మొత్తం తీర్పే ఈ అంశాన్నే ఆధారం చేసుకొని సమర్థించడం ‘రాజ్యాంగ బద్ధమేనా?’ 

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్‌ ఆఫ్‌ లా’లో ప్రొఫెసర్‌

>
మరిన్ని వార్తలు