పేలనున్న పెట్రోలు బాంబు!

1 May, 2019 13:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రజానీకం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో మునిగిపోవడంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అలీన దేశాలకు ఇచ్చిన అనుమతిని ఇప్పుడే రద్దు చేయడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత వారం స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో అప్పటివరకున్న బ్యారెల్‌ పెట్రోల్‌ ధర 75 డాలర్ల నుంచి 73 డాలర్లకు పడిపోయింది. ట్రంప్‌ ప్రకటన ప్రభావం స్పల్పంగానే పనిచేసింది. 

అంతర్జాతీయంగా చమురు ధరలు గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగాయి. గత ఆరు వారాల్లోనే 12 శాతం పెరిగాయి. దానికి అనుగుణంగా దేశంలో పెట్రోలు ధరలు ఎక్కడా పెరగలేదు. గత ఆరు వారాల్లో లీటరు పెట్రోల్‌కు కేవలం 47 పైసలు మాత్రమే పెరిగింది. మరి అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఎందుకు పెట్రోలు ధరలు పెరగలేదు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమి కాదు. ఎన్నికలు. ఈ సమయంలో పెట్రోలు ధరలు పెంచినట్లయితే అది పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రతికూలాంశం అవుతుందని ఆందోళనతో ఆ అంశాన్ని పక్కన పెట్టి ఉంటారు. చమురు ధరలను ఇలా తొక్కిపెట్టడం దేశంలో  ఇదే మొట్టమొదటిసారి కాదు. గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా చమురు ధరలను తొక్కిపట్టి ఉంచారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఎన్నికల సమయంలో నష్టపోయినా సొమ్మునంతా తిరిగి రాబట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశం ఉందని అఖిల భారత పెట్రోలు డీలర్ల సంఘం కోశాధికారి నితిన్‌ ఘోయల్‌ తెలిపారు. 

నేడు దేశంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడం లాంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలు ధరల పెంపు శిరోభారమే. ఇక వినియోగదారులకు అది పేలనున్న బాంబే.

మరిన్ని వార్తలు