బడ్జెట్‌.. పంచతంత్ర..

28 Jan, 2019 03:05 IST|Sakshi

ఫిబ్రవరి 1.. బడ్జెట్‌ టైం.. ఆ రోజున ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి

బదులుగా ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పియూష్‌ గోయల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ కూడా ఇదే.. అయితే.. ఏమిటీ మధ్యంతర బడ్జెట్‌.. పూర్తిస్థాయి బడ్జెట్‌కు దీనికి తేడా ఏమిటి? ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు.. అలా తీసుకోవచ్చా లేదా.. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు..

మరి.. వాటిని క్లియర్‌ చేసుకుందామా.. 
మధ్యంతర బడ్జెట్‌ అంటే.. 

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు(భారత్‌లో అది ఏప్రిల్‌ 1) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇదో ఆదాయ, వ్యయ పట్టిక. ఇందులో తనకు ఆదాయం వచ్చే మార్గాలను తెలపడంతోపాటు, ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతోందన్న విషయాన్నీ వివరిస్తుంది. మధ్యంతర బడ్జెట్‌ విషయానికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. ఇది మొత్తం సంవత్సరానికి సంబంధించిన పద్దు కాదు. పరిమిత కాలానికి సంబంధించినది. అంటే.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవరకూ ఇది అమల్లో ఉంటుంది. 

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌.. మధ్యంతర బడ్జెట్‌ ఒకటేనా.. 
సాధారణంగా ఒకదానికి బదులు ఒకదాన్ని వాడేస్తుంటాం కానీ.. రెండూ వేర్వేరు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ.. అంటే అధికార మార్పిడి కాలం వరకూ అయ్యే రోజువారీ వ్యయాలకు సంబంధించిన అంచనాలు మాత్రమే ఉంటాయి. అదే మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయం, వ్యయం రెండింటి అంచనాలు ఉంటాయి. పాలసీపరమైన చర్యలు తీసుకోవచ్చు. రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా(సీఎఫ్‌ఐ) నుంచి నిధులను తీసుకునేందుకు కేంద్రం పార్లమెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు.. మధ్యంతర బడ్జెట్‌లో
ఆర్థిక బిల్లు ఉండదు. దీని వల్ల ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయడానికి ఉండదు. శ్లాబ్‌లు పాతవే ఉంటాయి. ఎకనామిక్‌  సర్వే కూడా ఉండదని చెబుతున్నారు.
సాధారణంగా అయితే రాబోయే ప్రభుత్వంపై భారం మోపేలా విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ప్రకటించరు.  

అస్సలు తీసుకోవడానికి లేదా.. 
రాజ్యాంగపరంగా చెప్పాలంటే.. తీసుకోవచ్చు. ఎందుకంటే.. మధ్యంతర బడ్జెట్‌లో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. సాధారణంగా తీసుకోరు అంతే.. ‘ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టేటట్లయితే.. ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలనైనా తీసుకోవచ్చు’ అని ప్రముఖ న్యాయవాది అరవింద్‌ దతార్‌ ‘బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌’కు తెలిపారు. మరికొందరు కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. అయితే,   కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా దీంతో విభేదిస్తున్నారు. ఎకనామిక్‌ సర్వే ఉండదు, ఆర్థిక బిల్లు ఉండదు.. అలాగే విధానపరమైన నిర్ణయాలు కూడా ఉండకూడదని పేర్కొంటున్నారు.

ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఏముండొచ్చు.. 
పాత సంప్రదాయాలకు భిన్నంగా మధ్యంతర బడ్జెట్‌ ఉండొచ్చన్నట్లుగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు. దాన్ని బట్టి మోదీ సర్కారు కొన్ని విధానపరమైన కీలక నిర్ణయాలను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన తమ ప్రాధాన్యతలు ఇవీ అని తెలియజేయడానికి ఈ మధ్యంతర బడ్జెట్‌ను ఓ అవకాశంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతాంగానికి తెలంగాణలోని రైతు బంధు తరహా పథకాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు. జైట్లీ మాటలను బట్టి చూస్తే.. పాత సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ.. ఆదాయపు పన్ను వంటివాటిల్లో మినహాయింపులు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు.  
 

మరిన్ని వార్తలు