గుడ్‌న్యూస్‌.. రాత్రి వరకు సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకి!

22 Nov, 2023 19:42 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ సొరంగం ప్రమాదం నుంచి బాధిత కార్మికులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న నలబై ఒక్క మంది కార్మికులను బయటకు తీసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలోని కార్మికులను వెలికి తీసేందుకు సహాయ బృందాలు  కేవలం 12 మీటర్ల దూరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

నేటి రాత్రి 11. 30 గంటలలోపు  మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పనులన్నీ ఆశావహంగా సాగుతున్నాయని చెబుతున్నాయని, అమెరికాకు చెందిన డ్రిల్లింగ్‌ మిషన్‌ మరో ఆరు మీటర్ల శిథిలాలను తొలగించినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖకు చెందిన  ప్రత్యేక అధికారి భాస్కర్ ఖుల్బే పేర్కొన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘మేము మరో ఆరు మీటర్లు ముందుకు వెళ్లగలిగామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మరో రెండు గంటల్లో తదుపరి దశకు సద్ధమవుతున్నాం. అతి తక్కువ సమయంలోనే మిగిలిన పనిని పూర్తి చేయగలమని భావిస్తున్నాం’ అని మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు 67శాతం డ్రిల్లింగ్‌ పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది కార్మికుల కోసం పడకలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే టన్నెల్‌ బయట 20 అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు.  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంది. 
చదవండి: Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే!

సహాయక చర్యలు కీలక దశకు చేరుకోవడంతో తమ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. వారిని విమానంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. డెహ్రాడూన్‌ నుంచి రాంచీకి విమానంలో తరలించనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ప్రమాదం జరిగి పది రోజులు కావొస్తుంది. చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్‌ అందిస్తున్నారు. ఫోన్లు కూడా పంపించి వారితో వీడియో కాల్‌ మాట్లాడుతున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌తో సహా ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు ఈ భారీ ప్రయత్నానికి పూనుకున్నాయి.  

మరిన్ని వార్తలు