పఠాన్ కోట్ హీరో ఇల్లు.. పడగొట్టే యత్నం..!

11 Aug, 2016 15:45 IST|Sakshi
పఠాన్ కోట్ హీరో ఇల్లు.. పడగొట్టే యత్నం..!

బెంగళూరుః బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపి) చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా  పఠాన్ కోట్ దాడిలో ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ నివాసం పడగొట్టాలనుకోవడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఉగ్రదాడి సందర్భంలో అసువులు బాసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ ఎస్జీ) కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగం పడగొట్టేందకు బీబీఎంపి నిశ్చయించింది.

కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ సిద్ధరామయ్య సూచనల మేరకు బెంగళూరులో కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ నివాసంలోని కొంత భాగాన్ని కూల్చాలని బృహత్  బెంగళూరు మహానగర పాలిక నిశ్చియించింది. అయితే దేశంకోసం ప్రాణత్యాగం చేసిన నిరంజన్ కుమార్ కుటుంబానికి కనీస గౌరవం అందించాల్సి ఉందంటూ, సీఎం నిర్ణయాన్ని భారతీయ జనతాపార్టీ నాయకుడు జగదీష్ షెట్టార్ విభేదిస్తుండగా... ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ కుటుంబానికి గృహ నిర్మాణంకోసం మరో స్థలాన్ని ఇవ్వనున్నట్లు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర చెప్తున్నారు.

మరోవైపు తాము చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు నిరంజన్ కుటుంబం మద్దతునివ్వడం పట్ల బీబీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ ఎ ఆలం ప్రశంసలు కురిపించారు. తమ నివాసంలోని ఆక్రమిత భాగాన్ని పడగొట్టేందుకు అంగీకరించిన ఎన్ఎస్జీ కంమాండో తల్లిదండ్రులకు ఆయన శాల్యూట్ చేశారు. అయితే తన సోదరుడి త్యాగాన్ని గుర్తించయినా  కూల్చివేత డ్రైవ్ ను ఆపాలని, లేదంటే కొంత సమయమైనా  ఇవ్వాలని నిరంజన్ సోదరుడు కోరారు. ఈ చర్యలు తమకెంతో సిగ్గుగా అనిపిస్తున్నాయని, పఠాన్ కోట్ దాడిలో సోదరుడి ప్రాణాలు పోగొట్టుకున్న బాధలో ఉన్న తాము.. ఇల్లు కూలగొట్టే చర్యను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందంటూ ఉద్వేగంగా మాట్టాడారు. ముందస్తుగా  ప్రయర్ నోటీసులు జారీ చేసి ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళమని, ఇటువంటి చర్యలు ప్రభుత్వానికే కాక, దేశానికే తలవంపులని ఆందోళన వ్యక్తం చేశారు.

బెంగళూరు నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు 'బీబీఎంపీ' కూల్చివేతల కార్యక్రమం చేపట్టింది. నిరంజన్ కుమార్ ఇంటితోపాటు,  డ్రైవ్ లో భాగంగా అక్కడి 1100 వరకూ అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ కూడా చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడి సందర్భంలో రాత్రంగా  కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఎస్జీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ లో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ సభ్యుడు. నిర్వీర్యం చేసే ప్రయత్నంలో గ్రెనేడ్ పేలడంతో  నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని వార్తలు