కజిరంగాలో ప్రిన్స్ జంట

14 Apr, 2016 02:22 IST|Sakshi
కజిరంగాలో ప్రిన్స్ జంట

కజిరంగా: బ్రిటన్ యువరాజు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్‌లు బుధవారం అస్సాంలోని ప్రముఖ కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. ప్రపంచంలోని ఖడ్గమృగాల్లో అత్యధికం ఇక్కడే ఉన్నాయి. గట్టి భద్రత నడుమ  రెండు గంటలపాటు విలియం దంపతులు ఓపెన్ జీపులో పార్కులోని ప్రకృతి అందాలను, ఖడ్గమృగాలు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులను చూశారు. పెద్ద పులులు ఉండే ప్రదేశాలను చూశారు. బిమోలీ క్యాంప్ వద్ద అల్పాహారం తీసుకున్నారు. ఖడ్గమృగాలు, ఏనుగుల గురించి అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేటగాళ్లను కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటన సందర్భంగా విలియం, కేట్‌లకు కజిరంగా సమాచార కేంద్రం వద్ద ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఏపీ పాండే, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పార్కు సందర్శన అనంతరం వారు పరిసరాల్లోని గ్రామాల్లో పర్యటించారు. పార్కులోని ఏనుగుల రాకపోకలకు అంతరాయం కలగకుండా తమ ఇళ్లను ఇతర ప్రాంతాలకు మార్చుకున్న రోంగ్ టెరాంగ్ గ్రామస్తులను విలియం, కేట్‌లు కలుసుకున్నారు. తొలుత వారు గ్రామంలోని ‘నామ్‌ఘర్’ మందిరాన్ని సందర్శించారు. సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ రిహబిలిటేషన్, కజిరంగా డిస్కవరీ సెంటర్‌లకు వెళ్లారు. అక్కడ ఏనుగులు, ఇతర జంతువులకు సంబంధించిన డాక్యుమెంటరీని వీక్షించారు.

మరిన్ని వార్తలు