నేడు నింగికి పీఎస్ఎల్ వీ-సీ35

26 Sep, 2016 06:51 IST|Sakshi
నేడు నింగికి పీఎస్ఎల్ వీ-సీ35

ఉదయం 9.12కు ముహూర్తం
తొలిసారిగా విభిన్న కక్ష్యల్లోకి ప్రయోగం
8 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న సీ35

 శ్రీహరికోట(సూళ్లూరుపేట): తొలిసారిగా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ‘పీఎస్‌ఎల్‌వీ-సీ35’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ35 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నౌక మొత్తం 8 ఉపగ్రహాలను రెండు విభిన్న కక్ష్యల్లోకి ప్రవేశపెడుతుంది.

వీటిలో భారత్‌కు చెందిన వాతావరణ ఉపగ్రహం స్కాట్‌శాట్-1తో పాటు అమెరికా, కెనడా తదితర ఐదు విదేశీ ఉపగ్రహాలున్నాయి. వీటి మొత్తం బరువు 675 కిలోలు. 48.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ35 రాకెట్ ప్రయోగాన్ని ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశల్లో 32 నిమిషాల్లో పూర్తి చేస్తారు. తుపానులను గుర్తించడం, గాలి ఉధృతిని గమనించడం వంటి కీలక వాతావరణ సమాచారాన్ని స్కాట్‌శాట్-1 ద్వారా పొందవచ్చు. 

 ప్రయోగమిలా...
పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగించిన 17 నిమిషాలకు స్కాట్‌శాట్-1ను భూమికి 730 కి.మీ.ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆతర్వాత నౌకను కిందకు రప్పించి 689 కి.మీ.ల ఎత్తులోని కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెడతారు.

తిరుమలలో నమూనా రాకెట్‌కు పూజలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ35 నమూనా రాకెట్‌కు పూజలు నిర్వహించారు. షార్ నుంచి సోమవారం పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇస్రో ప్రతీ ప్రయోగానికీ తిరుమలలో రాకెట్ నమూనాకు పూజలు చేయడం ఆనవాయితీ. ఇస్రో లాంచ్‌వెహికల్ ప్రోగ్రాం డెరైక్టర్ ఎస్‌కే కనుంగో, శాటిలైట్ కమ్యునికేషన్ ప్రోగ్రాం డెరైక్టర్ సేతురామన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు