పదిసార్లు ‘భారత్‌ మాతాకీ జై’ అంటా

5 Dec, 2018 01:58 IST|Sakshi

రాహుల్‌ భరతమాతను  అవమానించారు

రాజస్తాన్‌లో ఎన్నికల  ర్యాలీల్లో ప్రధాని మోదీ  

జైపూర్‌/హనుమాన్‌గఢ్‌: ‘భారత్‌ మాతాకీ జై’ అనొద్దంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనను ఆదేశిస్తున్నారనీ, ఇక నుంచి ప్రతిచోటా 10 సార్లు తాను ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నినాదాన్ని పలకొద్దని చెప్పడం ద్వారా రాహుల్‌ భరత మాతను అవమానించారని మోదీ ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల ర్యాలీలో భారత్‌ మాతాకీ జై అని మోదీ అంటున్నారు. కానీ ఆయన దేశం కోసం కాకుండా కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు.

ఇక నుంచి ఆయన అనిల్‌ అంబానీకీ జై, నీరవ్‌ మోదీకీ జై, మెహుల్‌ చోక్సీకీ జై, లలిత్‌ మోదీకీ జై అని నినాదాలివ్వాలి’ అని అన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘కాంగ్రెస్‌కు ఓ రాజవంశీకుడు ఉన్నాడు. భారత్‌ మాతాకీ జై అని మోదీ అనకూడదంటూ ఆ రాజవంశీకుడు ఈ రోజు ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని నేను ధిక్కరిస్తూ ఇక నుంచి లక్షల మంది సాక్షిగా ప్రతిచోటా నేను పదిసార్లు భారత్‌ మాతాకీ జై అని నినదిస్తాను’ అని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు భారత్‌ మాతాకీ జై అని అరుస్తూ వీరమరణం పొందారనీ, కానీ రాహుల్‌ భరత మాతను అవమానిస్తున్నారని మోదీ ఆరోపించారు. అత్యాచారం కేసుల్లో దోషులుగా ఉన్న వారి కుటుంబీకులకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందనీ, మహిళలెవరూ ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన కోరారు. 

ఎర్ర, పచ్చి మిరపకు తేడా తెలీదు.. 
రాహుల్‌కు ఎర్ర మిరపకాయలు, పచ్చి మిరపకాయలకు మధ్య తేడా కూడా తెలీదని మోదీ ఎద్దేవా చేశారు. ‘పచ్చి మిరప కన్నా ఎర్ర మిరపకు ధర ఎక్కువ ఉంటుందని మీరు చెబితే.. అయితే రైతులంతా ఎర్ర మిరపనే సాగు చేయాలని ఆయన అంటాడు. ‘ఈ దేశానికి తొలి ప్రధాన మంత్రి ఒక రైతు బిడ్డ అయ్యుంటే, సర్దార్‌ పటేల్‌ తొలి ప్రధాని అయ్యుంటే ఇప్పుడు రైతులకు ఇన్ని సమస్యలు ఉండేవే కావని నేను గట్టిగా చెప్పగలను. ఒక్క కుటుంబంలోని నాలుగు తరాల వారు 70 సంవత్సరాలు చేసిన పాపాల ఫలితం ఇది. వారి తప్పులను నేను సరిచేస్తున్నాను. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, దూరదృష్టి, సిక్కుల మనోభావాలపై గౌరవం ఉండి ఉంటే నేడు కర్తార్‌పూర్‌ గురుద్వారా పాకిస్తాన్‌ అధీనంలోకి వెళ్లేది కానేకాదు. భారత్‌లోనే ఉండేది. ఇన్నాళ్లూ భారతీయ సిక్కులు గురుద్వారాను సందర్శించేందుకు ఎన్నో తిప్పలు పడేవారు. ఆ తప్పును ఇప్పుడు మేం సరిచేస్తున్నాం’ అని మోదీ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు