ఎదురు తిరిగిన గవర్నర్లకు పొగ!

20 Jun, 2014 02:13 IST|Sakshi

పలు కేసుల్లో సీబీఐ విచారణకు అనుమతించాలని యోచన
 న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరు పదవి నుంచి వైదొలగేందుకు ససేమిరా అంటుండటంతో కేంద్రం వారిని సాగనంపేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. రాజకీయ పలుకుబడిగల లేదా పదవీకాలం తొలినాళ్లలో ఉన్న గవర్నర్ల తొలగింపే మోడీ ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల కొందరు గవర్నర్లను రాజకీయ ప్రాధాన్యతగల రాష్ట్రాలు లేక పెద్ద రాష్ట్రాల నుంచి అప్రాధాన్య రాష్ట్రాలకు బదిలీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనివల్ల వారంతట వారే తప్పుకునేలా చేయొచ్చని కేంద్రం భావిస్తోందని వివరించాయి.
 
 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె. నారాయణన్, గోవా గవర్నర్ వాంచూలను సాక్షులుగా సీబీఐ ప్రశ్నించేందుకు అనుమతించాలన్న ఆలోచనను అమలుచేయడం గురించి కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ గవర్నర్‌గా ఉన్న షీలాదీక్షిత్‌ను సైతం 2010 నాటి కామన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో అవకతవకలపై ప్రశ్నించేలా ఇదే రకమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. కాగా, గవర్నర్ల మార్పుపై కేంద్రం తీరును తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తలను నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ ఖండించారు.
 
 ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రాజీనామా: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్ తన పదవికి రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాల్సిందిగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో శేఖర్ దత్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు.

మరిన్ని వార్తలు