‘వెనకబాటు’ సమాచారం అక్కర్లేదు

27 Sep, 2018 03:23 IST|Sakshi

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రిజర్వేషన్ల వర్తింపునకు తొలగిన అడ్డంకి

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకున్న ప్రధాన అవరోధం తొలగిపోయింది. కోటా అమలుకు ముందు రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనంపై సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు ఈ నిబంధనే అడ్డుగా ఉందని ఇన్నాళ్లూ కేంద్రం చెబుతోంది. దళిత వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు కోసం పలు షరతులు విధించిన 2006 నాటి ఎం.నాగరాజ్‌ కేసు తీర్పును సమీక్షించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వర్తింపుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

క్రీమీలేయర్‌ నిబంధనకు సమర్థన..
ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనాన్ని ప్రతిబింబించే సమాచారాన్ని సేకరించాలని నాగరాజ్‌ కేసులో కోర్టు తుది నిర్ణయానికి రావడం 1992 నాటి ఇందిరా సహనీ కేసు(మండల్‌ కమిషన్‌ కేసు)లోని తీర్పుకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో, కోటా అమలు వ్యవహారంలో అలాంటి సమాచార సేకరణ చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీలు అత్యంత వెనకబడిన, బలహీన వర్గాలని, వారిని వెనకబాటు తరగతిగానే భావించాలని 58 పేజీల తీర్పు ప్రతిని రాసిన జస్టిస్‌ నారిమన్‌ అన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వర్తింపజేయాలన్న నాగరాజ్‌ తీర్పులోని భాగాన్ని బెంచ్‌ సమర్థించింది. వెనకబడిన తరగతులు అభివృద్ధిచెంది, ఇతరులతో సమాన స్థాయికి చేరుకోవాలన్నదే రిజర్వేషన్ల ప్రాథమిక లక్ష్యమని గుర్తుచేసింది.

క్రీమీలేయర్‌ లేనట్లయితే కొందరే కీలక పదవులు పొందుతారని, ఫలితంగా వెనకబడినవారు అలాగే ఉండిపోతారంది. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ వర్తింపు ఆర్టికల్స్‌ 341, 342 ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులపై ప్రభావం చూపదని తెలిపింది. ఇందిరా సహానీ కేసులో 9 మంది జడ్జీల్లో 8 మంది క్రీమీలేయర్‌ను సమానత్వ సూత్రాల్లో ఒకదానిగా పరిగణించారు. ఆర్టికల్‌ 341, 342లతో పాటు ఆర్టికల్‌ 14(సమానత్వ హక్కు), ఆర్టికల్‌ 16(ఉద్యోగాల్లో సమాన అవకాశాలు)లు ఒకదానితో ఒకటి విభేదించకుండా రాజ్యాంగంలో విస్పష్ట వివరణ ఉందని తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎవరిని తొలగించాలి? ఎవరిని చేర్చాలనేది పూర్తిగా పార్లమెంట్‌ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

కేసు నేపథ్యమిదీ..
ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలుపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2006 నాటి ఎం.నాగరాజ్‌ కేసులో కొన్ని షరతులు విధించింది. రిజర్వేషన్లు కల్పించే ముందు రాష్ట్రాలు.. ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనంపై పరిమాణాత్మక సమాచారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి తగినంత ప్రాతినిధ్యం దక్కడంలేదని నిరూపించే వివరాలు, సంస్థల పాలనా విధానాలపై రిజర్వేషన్ల ప్రభావం తదితర సమాచారం సేకరించాలని సూచించింది. ఈ నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, వారిని వెనకబడిన తరగతిగా భావిస్తూ పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు ఆ తీర్పును సమీక్షించాలని ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు కోర్టును కోరాయి. ఎం.నాగరాజ్‌ కేసులో కోర్టు అనవసర షరతులు విధించిందని విచారణ సందర్భంగా కేంద్రం ఆరోపించింది.

మరిన్ని వార్తలు