virat kohli: కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది

15 Nov, 2023 19:10 IST|Sakshi

వన్డే ప్రపంచ కప్‌ 2023 సెమీఫైనల్‌ వేదికగా విరాట్‌ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్‌పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్‌ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్‌ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. 

ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు.  ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్‌ తరాలకు బెంచ్‌మార్క్‌ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. 

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్‌ వేదికగా అభినందించారు. వెల్‌డన్‌ కింగ్‌కోహ్లీ. హాఫ్‌ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్‌.. అదీ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో. టేక్‌ ఏ బో అంటూ ట్వీట్‌ చేశారు. 

తన సెంచరీల ఫీట్‌ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఎక్స్‌ వేదికగా అభినందించగా..  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఆ ట్వీట్‌ను రీపోస్ట్‌ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్‌ను ఉద్దేశించి పోస్ట్‌ చేశారాయన. 

ఆప్‌ జాతీయకన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్‌ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. 
 

మరిన్ని వార్తలు