రాజ్‌భవన్‌ గుప్పిట్లో రహస్యం తలైవీ?... తలైవా?

10 Feb, 2017 07:18 IST|Sakshi
రాజ్‌భవన్‌ గుప్పిట్లో రహస్యం తలైవీ?... తలైవా?

. తమిళనాడు గవర్నర్‌ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
. విద్యాసాగర్‌రావును కలసిన పన్నీర్, శశికళ


- శాసనసభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని పన్నీర్‌ విన్నపం
- ఎమ్మెల్యేల పరేడ్‌కు శశికళకు అవకాశం ఇవ్వని గవర్నర్‌
- ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన చిన్నమ్మ
- తాజా పరిణామాలతో కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్‌
- పన్నీర్‌కు బలపరీక్ష అవకాశం ఇస్తారా?.. శశికళతో ప్రమాణం చేయిస్తారా?
- కేంద్రం ఏం సూచిస్తుంది? గవర్నర్‌ ఏం చేస్తారు?
- తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
- రెండు మూడు రోజుల్లో గవర్నర్‌ నిర్ణయం అంటున్న విశ్లేషకులు


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గురువారం సాయంత్రం ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్‌. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అంతకుముందే గవర్నర్‌ను కలిసిన పన్నీర్‌ సెల్వం తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వారిద్దరి వాదనలనూ సావధానంగా విన్న విద్యాసాగర్‌రావు నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్‌ ఏం నివేదిక పంపారు? కేంద్రం ఏ మార్గదర్శనం చేస్తుంది? గవర్నర్‌ నిర్ణయం ఏమిటి? తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి తలైవీ (నాయకురాలు)నా? తలైవా (నాయకుడు)నా?... అనే ప్రశ్నలకు సమాధానంకోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు శిబిరంలోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం, ఆకర్షించేందుకు పన్నీర్‌వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

పన్నీర్‌ తన దూకుడును పెంచి శశికళను ఆత్మరక్షణలో పడేసేందుకు యత్నిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలతో పరేడ్‌ నిర్వహించేందుకు శశికళ వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్‌ జాప్యం చేయడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ వివాదాన్ని ఇంకెంతోకాలం పొడిగించలేరని, 2, 3  రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించక తప్పదని... సంక్షోభానికి సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తమ వాదనలు వినిపించిన పన్నీర్, శశికళ
తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పరేడ్‌ నిర్వహించడానికి సమయం ఇవ్వాలని శశికళ బుధవారమే గవర్నర్‌ను ఫోన్‌లో కోరారు. ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వం కూడా తన వాదన వినిపించేందుకు సమయం అడిగారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు గవర్నర్‌ ఇద్దరికీ సమయం కేటాయించలేదు. ఈలోపే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీపీజీ రాజేంద్రన్‌తో తాజా పరిణామాల గురించి వివరాలు తెలుసుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు సాయంత్రం ఐదు గంటలకు పన్నీర్‌ సెల్వంకు, రాత్రి ఏడు గంటలకు శశికళకు సమయం కేటాయిస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్‌ భవన్‌ వర్గాలు వారికి సమాచారం అందించాయి. అయితే ఆ తర్వాత శశికళ అపాయింట్‌మెంట్‌ను రాత్రి 7:30కి మార్చారు.

ఎమ్మెల్యేలతో కాకుండా ఐదారుమందితోనే రావాలని రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన వర్తమానం శశికళను నిరుత్సాహానికి గురి చేసింది. గవర్నర్‌ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పన్నీర్‌తో 20 నిమిషాలు, శశికళతో 30 నిమిషాలు గవర్నర్‌ భేటీ అయ్యారు. శశికళ మద్దతుదారులు తనతో బలవంతంగా రాజీనామా లేఖపై సంతకం చేయించారని పన్నీర్‌ గవర్నర్‌కు తెలిపారు. . నిర్బంధం నుంచి ఎమ్మెల్యేలు బయటపడితే తనకే మద్దతిస్తారని, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశమివ్వాలని కోరారు.

మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ శశికళ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించారు.   వారిద్దరి వాదనలూ ఆలకించిన గవర్నర్‌ తాను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు. అయితే రాజ్‌భవన్‌ లోపల నుంచి బయటకు రాగానే అంతా మంచే జరుగుతుందని పన్నీర్‌ సెల్వం ధీమా వ్యక్తం చేయడం... శశికళ చిరునవ్వు లేకుండా బయటకు రావడం, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం êంటి దృశ్యాలు  అనేక రకాల చర్చలకు దారి తీశాయి.

కేంద్రంతో పోరాటానికి శశికళ సిద్ధం
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వం మాట విని పన్నీర్‌ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా, తనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించకుండా వాయిదా వేసినా కేంద్ర ప్రభుత్వం మీద దండ యాత్ర చేయాలని శశికళ శిబిరం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి గవర్నర్‌ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఎదుట పరేడ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రే 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు.

గవర్నర్‌ ఏం చేస్తారో!
తమిళనాడులో అన్నా డీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రధాని  మోదీ పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని శశికళ మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌ రాజన్, కేంద్రమంత్రి వెంకయ్య  వివరణా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపడం మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.

రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్‌ శశికళతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. అక్రమాస్తుల కేసులో ఆమెకు ఇంకా శిక్ష పడనందువల్ల ఆమెను సీఎం చేయడానికి   అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అదే కేసును  బూచిగా చూపి కేంద్రం ఆమెను  వేచి చూడాలని చెప్తే.. పన్నీర్‌కు పరోక్షంగా కొండంత మేలు చేసినట్లు అవుతుంది. ఈ సమయంలోపు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి పన్నీర్‌కు అవకాశం లభిస్తుంది. లేదా పన్నీర్‌ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా శశికళ తన శిబిరాన్ని కాపాడుకోవడం కష్టమే.

ఏ విధంగానైనా పన్నీర్‌కు తగినంత మద్దతు వచ్చేంతవరకూ ఈ సందిగ్ధతను గవర్నర్‌ సాగదీయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పన్నీర్‌ దూకుడు పెంచారు. ప్రభుత్వంతో పాటు పార్టీని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. శశికళ విధేయులుగా ముద్రపడిన వారిమీద వేటు వేస్తూ, ఆమె వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. దీంతోపాటు చిన్నమ్మ   నివాస ముంటున్న పోయెస్‌ గార్డెన్‌ను జయలలిత స్మారకభవనంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను ఆత్మరక్షణలో పడేశాయి.

వీడని ఉత్కంఠ
పోయెస్‌ గార్డెన్‌లో ఆదివారం మధ్యాహ్నం పన్నీర్‌ సెల్వంతో సీఎం పదవికి రాజీనామా చేయించడం, వెనువెంటనే చిన్నమ్మ శశికళను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడం చక చకా జరిగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కోసం శశికళ గవర్నర్‌ను సంప్రదించడం, ఊటీలో విహార యాత్రలో ఉన్న ఆయన చెన్నైకి రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లడంతో రాజకీయం వేడెక్కింది.  ఈలోపే మంగళవారం రాత్రి పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో తమిళనాడు రాజకీయాలు వేగంగా మలుపులు తిరిగాయి. రాష్ట్రంలో పాలనాపరమైన సంక్షోభం ఏర్పడినా గవర్నర్‌ చెన్నైకి రాకుండా ముంబైలో ఉండిపోవడం రాజకీయ దుమారం రేపింది.

ప్రధాని మోదీ మీద, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేందుకు శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన గవర్నర్‌ గురువారం తన చెన్నై పర్యటనను అధికారికంగా వెల్లడించారు. ఆయన చెన్నైకి చేరుకుని పన్నీర్, శశికళతో చర్చించాక వెంటనే ఈ వివాదానికి తెర దించుతారని రాజకీయ వర్గాలు, ప్రజలు భావించారు. అయితే గవర్నర్‌ ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరడంతో అన్నా డీఎంకే రాజకీయ సంక్షోభానికి తెర దిగలేదు. గవర్నర్‌ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారా? లేక కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసి తానూ రాజకీయ నాయకుడేనని చాటుకుంటారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

శాసనసభా పక్ష నాయకునిగా ఒకరిని ఎన్నుకున్నాక ప్రమాణస్వీకారాన్ని కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వ్యూహాత్మకంగా జాప్యం చేయడమే సంక్షోభానికి కారణమని న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. వీళ్ల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సాధనలో భాగంగానే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల మనోభావాలను సాకుగా చూపుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇది భవిష్యత్తులోవిపరిణామాలకు దారితీయవచ్చని, తమకు నచ్చని వారిని అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఓ సాధనంలా వాడుకునే దుస్సంప్రదాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.