అదనపు జడ్జీల పనితీరు మదింపునకు ఓకే

28 Oct, 2017 01:43 IST|Sakshi

న్యూఢిల్లీ: అదనపు న్యాయమూర్తులను హైకోర్టుల్లో శాశ్వత జడ్జీలుగా నియమించేందుకు పనితీరు మదింపును చేపడతామని సుప్రీం కోర్టు కొలీజియం తెలిపింది. ఈ మేరకు గురువారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హైకోర్టుల్లో అదనపు జడ్జీలు ఇచ్చిన తీర్పుల్ని ఆయా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జీల కమిటీకి నివేదిస్తారని పేర్కొంది. ఈ కమిటీని సీజేఐ జస్టిస్‌ ఖేహర్‌ ఏర్పాటు చేస్తారంది. ఈ వివరాలను సుప్రీం తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

ఇప్పటివరకు హైకోర్టుల్లో అదనపు జడ్జీల పనితీరును అంచనా వేసేందుకు ‘తీర్పుల మదింపు కమిటీలు’ ఉండేవి. వీటిని రద్దు చేస్తున్నట్లు సీజేఐ జస్టిస్‌ ఖేహర్‌ మార్చిలో ప్రకటించగా.. ఈ విషయమై పునరాలోచించాల్సిందిగా సుప్రీంను కేంద్రం కోరింది. దీంతో అత్యున్నత ధర్మాసనం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నేపథ్యం లేని సామాన్యులైన తొలి తరం లాయర్లు కూడా సుప్రీం కోర్టు జడ్జీలుగా ఎంపికయ్యారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.

సుప్రీంలో జడ్జీల ఎంపికలో వివక్ష పాటిస్తున్నారంటూ సీనియర్‌ న్యాయవాది ఆర్‌పీ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్, జస్టిస్‌ యుయు లలిత్‌ల బెంచ్‌ తిరస్కరించింది. సుప్రీంలో కేవలం రెండే ఖాళీలు ఉన్నప్పుడు వంద మంది వ్యక్తుల నుంచి అత్యంత అర్హులైన ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఇలాంటి సమయంలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చని వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు