సుప్రీంకు మళ్లీ జస్టిస్‌ జోసెఫ్‌ పేరు

21 Jul, 2018 04:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరును సుప్రీంకోర్టు జడ్జి పదవికి కొలీజియం మరోసారి సిఫార్సు చేసింది. ఆయన పదోన్నతిపై గతంలో కేంద్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను పక్కనపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖల్లో జస్టిస్‌ జోసెఫ్‌ అర్హతను తక్కువచేసి చూపే విషయాలేవీ లేవని పేర్కొంది. జస్టిస్‌ జోసెఫ్‌తో పాటు మద్రాస్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ల పేర్లను సుప్రీంజడ్జీలుగా ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

సుప్రీంకోర్టు జడ్జి పదవికి జస్టిస్‌ జోసెఫ్‌ పేరుకు కొలీజియం తొలుత జనవరి 10నే పచ్చజెండా ఊపగా, ఏప్రిల్‌ 28న కేంద్రం తిరస్కరించింది. జస్టిస్‌ జోసెఫ్‌ సొంత రాష్ట్రం కేరళకు ఇది వరకే సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉన్నందున, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కొలీజియంకు తిరిగి లేఖ రాసింది. మరోవైపు, కలకత్తా హైకోర్టు జడ్జి అనిరుద్ధ బోస్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న సుప్రీం కొలీజియం సిఫార్సును కేంద్రం తోసిపుచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. 2004లో జడ్జిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ బోస్‌కు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం లేదని పేర్కొంది. ఆయనకు బదులు మరో సీనియర్‌ జడ్జి పేరును ప్రతిపాదించాలని సూచించింది.  

నిర్మాణ కార్మికుల పథకంపై డెడ్‌లైన్‌
భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే పథకానికి సెప్టెంబర్‌ 30వ తేదీలోగా తుదిరూపు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి గడువు విధించింది. శుక్రవారం విచారణ సందర్భంగా  బెంచ్‌ ఎదుట కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి హాజరయ్యారు.

రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆందోళన
గుంతలమయమైన రోడ్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలతో దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మరణాలు భయం పుట్టిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో రోడ్డు భద్రత అంశంపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ‘ఉగ్రవాద దాడుల్లో మరణిస్తున్నవారి కంటే కూడా రోడ్లపై గుంతల వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారే ఎక్కువ’అని ధర్మాసనం మీడియా నివేదికలను ఊటంకించింది.

మరిన్ని వార్తలు