ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం

2 Feb, 2017 03:18 IST|Sakshi
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం

దళితులకు 35 శాతం పెంపు ∙గిరిజన సంక్షేమానికి 31,920 కోట్లు

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లోనూ కేంద్రం పెద్దపీట వేసింది. దళితుల సంక్షేమానికి 2016–17లో కేటాయించిన రూ.38,833 కోట్లను ఈసారి రూ.52,393కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. గతంతో పోలిస్తే ఇది 35 శాతం అదనం. తాజా బడ్జెట్‌లో గిరిజన సంక్షేమ శాఖకు గతేడాదితో పోలిస్తే అదనంగా రూ.5,329 కోట్లు (10 శాతం అదనం) కేటాయించారు. 2016–17 బడ్జెట్‌ లో ఈ శాఖకు రూ. 24,005కోట్లు కేటాయించగా.. ఈసారి దీన్ని రూ.31, 920 కోట్లకు పెంచారు. ఈ విభాగాల్లో సరైన ఫలితాలు వచ్చేందుకు నీతి ఆయోగ్‌ ద్వారా వ్యయ సమీక్ష జరపాలని కేంద్రం భావిస్తోంది.

మైనారిటీల కోటాకు 10 శాతం అదనం
ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలను విస్మరిస్తోం దంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలనుంచి తప్పించుకునేందుకు మైనారిటీ సంక్షేమ శాఖకు కేంద్రం గతేడాదికన్నా దాదాపు 10 శాతం నిధులను అదనంగా ఇచ్చింది. తాజా బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.4,195 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.2,053.54 కోట్లు మైనారిటీల్లో విద్యా సాధికారత పెంచేందుకు, రూ.1200 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు, రూ.634.95 కోట్లను నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత మైనారిటీల బడ్జెట్‌ రూ.368 కోట్లు పెరిగింది. ఇది మైనారిటీల సాధికారితకు బాటలు వేస్తుంది’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు.

‘తోలు’కు చేయూత
న్యూఢిల్లీ: జౌళి, చేనేత రంగానికి అమలు చేస్తున్న తరహాలోనే తోలు, పాదరక్షల పరిశ్రమ కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడతా మని అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. అలాగే తోళ్ల శుద్ధికి వాడే వెజిటబుల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 7.5 నుంచి 2.5కు తగ్గించారు. జూన్, 2016లో చేనేత, జౌళి రంగానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. మూడేళ్లలో కొత్త ఉద్యోగాలు కల్పించడంతో పాటు దాదాపు రూ. 74,800 కోట్ల పెట్టుబడుల్ని ఆక్షరించడం పథకం ప్రధాన లక్ష్యం. అలాగే రూ.2,04,000 కోట్ల ఎగుమతుల్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలాంటి పథకమే తోలు, పాదరక్షల పరిశ్రమకు వర్తింపచేస్తే... రూ.కోటి పెట్టుబ డికి 250 మంది ఉపాధి పొందుతారు. ప్రస్తుతం ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా 30లక్షల మంది ఆధారపడుతున్నారు. ప్రస్తుతము న్న రూ. 47,600 కోట్ల పెట్టుబడుల్ని కూడా 2020 నాటికి రూ.1,02,000 కోట్లకు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

పన్నుల రద్దుతో చేనేతకు సాయం: స్మృతి ఇరానీ
బడ్జెట్‌లో చేనేత రంగానికి సంబంధించి రూ. 1,555 కోట్ల మేర రాష్ట్ర పన్నుల రద్దు వస్త్ర రంగంలో ఎగుమతులకు ఎంతో ఉపకరిస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. చేనేత, జౌళి శాఖకు రూ.6,226.50 కోట్లు కేటాయించినందుకు ట్వీటర్‌ లో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారిగా ప్రధానమంత్రి పరిధాన్‌ రోజ్‌గార్‌ యోజన కింద వస్త్ర రంగంలో ఉపాధి కల్పనకు రూ. 200 కోట్ల కేటాయించారంటూ ట్వీట్‌ చేశారు.

వృద్ధులకు గుడ్డిలో మెల్ల...
దేశంలో వృద్ధులు : 10.39 కోట్లు
(2011జనాభా లెక్కల ప్రకారం)


మార్కెట్లో ఎన్ని యాప్‌లున్నా... మన మొబైల్లో మెమొరీ ఉండాలి కదా!! పెట్టుబడికి ఎన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ పథకాలున్నా రాబడికి గ్యారంటీ ఉండాలి కదా!! పైపెచ్చు ఉద్యోగం చేసినన్నాళ్లూ దాచుకున్న సేవింగ్స్‌పై తగిన వడ్డీ వస్తేనే జీవితం సాఫీగా వెళుతుంది. ఎందుకంటే మన దగ్గర పెన్షన్‌గానీ, సామాజిక భద్రతగానీ లేని వృద్ధులే మెజారిటీ. అందుకే 8 శాతం రాబడి తప్పనిసరిగా వచ్చేలా వారికి ఎల్‌ఐసీ ద్వారా ప్రత్యేక పథకం తెస్తానన్నారు. ఇది పెద్దలందరికీ సంతోషకరమే!! వృద్ధులకు ఆరోగ్య వివరాలన్నీ నమోదు చేసిన ఆధార్‌ ఆధారిత స్మార్ట్‌ కార్డులిస్తామని కూడా హామీనిచ్చారు జైట్లీ. కార్డులు సరే!! సరైన వైద్యం అందాలి కదా?

మరిన్ని వార్తలు