విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్

2 Jul, 2017 07:55 IST|Sakshi
విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్

ముంబై: పాఠశాల నిబంధనలు పాటించలేదన్న కారణంగా విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది హెయిర్ కట్ చేసి తీవ్ర విమర్శల పాలైంది. ఈ వివాదానికి సంబంధించి ముగ్గురు పాఠశాల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబై శివారులోని విఖ్రోలిలో జరిగింది. బాధిత విద్యార్థుల్లో 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారు ఉన్నారు. పాఠశాల నిబంధన ప్రకారం విద్యార్థులంతా పొట్టి జుత్తుతో ఉండాలని కొద్ది రోజుల కిందట పీఈటీ ఆదేశించారు.

దాదాపు 25 మంది విద్యార్థులు రూల్స్ పాటించకుండా.. పొడవైన జుత్తుతో పాఠశాలకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన పాఠశాల డైరెక్టర్‌ గణేష్‌ బాతా, వ్యాయామ ఉపాధ్యాయుడు మిలింద్‌ జంకె, ఆఫీసు అసిస్టెంట్‌ తుషార్‌ గోరె వీరికి బలవంతంగా జుత్తు కత్తిరించారని పోలీసులు తెలిపారు. ఈ సామూహిక జుత్తు కత్తిరింపులో కొందరు బాలురు కత్తెర కారణంగా గాయాలపాలయ్యారు. ఈ సంఘటనపై కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదుపై శుక్రవారం అర్ధరాత్రి పాఠశాల డైరెక్టర్‌ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు