పువ్వులు కాదు, ఆహారం కావాలి!

4 May, 2020 20:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితులకు చికిత్సలు అందిస్తోన్న ఆస్పత్రులపై ఆదివారం నాడు వైమానిక, నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గులాబీ రెక్కలు చల్లడం, ఆస్పత్రుల్లో పని చేస్తోన్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేయడంలో భాగంగా వైమానిక దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేయడం పట్ల సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్‌’ తనదైన శైలిలో స్పందించింది. ఓ పక్క వైద్య సిబ్బంది గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్‌ సూట్ల లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో పేద ప్రజలు, వలస కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే ఈ గులాబీ పూల వర్షాలేమిటీ, ఈ విమానాల విన్యాసాలు ఏమిటని పలువురు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఆ గులాబీ రెక్కలను వెదజల్లే బదులు ఆహార పొట్లాలను జార విడిచినా పేదలకు పూట గడిచేదికదా ? అని మరికొందరు స్పందించారు. ( లాక్‌డౌన్‌ : తిండిలేక 200 కుక్కలు మృతి )

విమాన విన్యాసాలకు డబ్బును వృధా చేసే బదులు వలస కార్మికులకు ఆదుకునేందుకు ఆ డబ్బును ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని మరి కొందరు స్పందించారు. పైగా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పనిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ‘గులాబీ రేకులు’ చల్లడం ద్వారా అదనపు పని భారం మోపారంటూ కొందరు విమర్శించారు. కార్టూనిస్టులు కూడా తమదైన శైలిలో స్పందించి వ్యంగ్య చిత్రాలను గీశారు.

మరిన్ని వార్తలు