మహారాష్ట్రలో మూడో ఫ్రంట్‌?

6 Jan, 2018 02:45 IST|Sakshi

వామపక్షాలు, దళిత, ముస్లిం పార్టీలతో కూటమి!

సాక్షి, ముంబై: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో తృతీయ కూటమిని ఏర్పరిచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ–శివసేన, కాంగ్రెస్‌–ఎన్సీపీల కూటములు ఉండగా, వీటికి ప్రత్యామ్నాయంగా వామపక్షాలు, ఓబీసీలు, ప్రోగ్రెసివ్, దళిత, ముస్లిం పార్టీలన్నీ కలసి మూడో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు, ‘బీఆర్‌పీ బహుజన్‌ మహాసంఘ్‌’ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మూడో కూటమికి నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భీమా–కోరేగావ్‌ ఘటనలో దళితులపై దాడులను ఖండిస్తూ ప్రకాశ్‌ అంబేడ్కర్‌ పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమవడం తెలిసిందే. ఈ బంద్‌తో ఆయన తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడంతోపాటు దళితులను ఏకతాటిపైకి తీసుకురావడంలో çసఫలమయ్యారని చెప్పవచ్చు. తమ ఆలోచనలను, ప్రణాళికలను అమలు చేయాలంటే అధికారంలోకి రావాలనీ, అందుకోసం బీజేపీ–శివసేన, కాంగ్రెస్‌–ఎన్సీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పాటు చేయడమే మార్గమని వామపక్షాలు, ఓబీసీలు, ప్రగతిశీల (ప్రోగ్రెసివ్‌), దళిత, ముస్లిం, సంభాజీ బ్రిగేడ్‌ మొదలైన వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు