మహదేవున్నీ వదల్లేదు!

5 Nov, 2023 05:26 IST|Sakshi

దుర్గ్‌: దుబాయ్‌కి చెందిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు ముడుపుల అంశంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్‌తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్‌ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. యాప్‌ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం దుర్గ్‌ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్‌ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని యాప్‌ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బఘేల్‌ బయట పెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.

ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లు
దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందిస్తున్న ప్రధాన్‌మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు