అధ్యక్షుని చర్య రాజ్యాంగ విరుద్ధం 

14 Dec, 2018 04:55 IST|Sakshi

పార్లమెంట్‌ రద్దుపైశ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు 

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం నాలుగున్నరేళ్లయినా పూర్తి చేయకుండా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయజాలడని పేర్కొంది. ప్రధాన మంత్రి రణిల్‌ విక్రమసింఘేను అక్టోబర్‌ 26వ తేదీన తొలగించిన అధ్యక్షుడు , ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను నియమించారు. దీంతోపాటు 20 నెలల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేసి, జనవరిలో ఎన్నికలు జరిపేందుకు అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. అధ్యక్షుడి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం అధ్యక్షుడు జారీ చేసిన తక్షణ ఎన్నికల ఉత్తర్వులను నిలిపివేస్తూ నవంబర్‌ 13వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పటి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏడుకు పెంచింది. గురువారం తీర్పు సందర్భంగా అధికారులు సుప్రీంకోర్టు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు