బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు

14 Dec, 2018 05:04 IST|Sakshi

ఎన్నికల ఫలితాలపై సీపీఎం విశ్లేషణ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్‌ఎస్‌ అనుకూల సెంటిమెంట్‌ ఏర్పడేందుకు కేసీఆర్‌ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్‌ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్‌కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఓట్ల సాధనలో బీఎల్‌ఎఫ్‌ విఫలం...
ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్‌ఎఫ్‌ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్‌ఎఫ్‌ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు