స్పీకర్, డిప్యూటీ సీఎంలకు సుప్రీం నోటీసు

10 Jul, 2018 02:38 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారంలో తమిళనాడు స్పీకర్‌ ధనపాల్, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు 4వారాల్లోగా బదులివ్వాలని ఆదేశించింది. పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విశ్వాస పరీక్ష తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వంతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆ 11 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హతవేటు వేయాలని డీఎంకే విప్‌ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్‌ నిర్ణయంలో తలదూర్చలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో చక్రపాణి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్కే నగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ సైతం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. 

మరిన్ని వార్తలు